Raghu Rama Krishna Raju: ప్రధాని మోదీకి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ
- రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయానికి మించి సంక్షేమ పథకాల అమలు
- ఉచిత పథకాల వల్ల ఖజానాలు ఖాళీ
- కోలుకోలేని అప్పుల్లో రాష్ట్రాలు
- చట్టం ద్వారా నియంత్రణలోకి తీసుకురావాలి
రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయానికి మించి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని, తగు చర్యలు తీసుకోవాలని ఇటీవలే ఎంపీ రఘురామకృష్ణ రాజు కోరిన విషయం తెలిసిందే. ఈ రోజు మోదీకి ఆయన ఇదే విషయంపై లేఖ రాశారు.
రాష్ట్రాల్లో ఉచిత పథకాల ద్వారా ఖజానాలు ఖాళీ అవుతున్నాయని, కోలుకోలేని అప్పుల్లో రాష్ట్రాలు కూరుకుపోతున్నాయని చెప్పారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులను ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని తెలిపారు. ఓట్ల కోసం నిధులను కూడా ఉచితాలకు తరలిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య కేంద్ర ప్రభుత్వం వివక్ష పూరిత ధోరణితో వ్యవహరిస్తోందని వస్తోన్న ఆరోపణలకు కూడా ఇదే మూలమని ఆయన చెప్పుకొచ్చారు. ఇటువంటి చర్యలను చట్టం ద్వారా నియంత్రణలోకి తీసుకురావాలని ఆయన కోరారు.