Ganta Srinivasa Rao: పోలీసులు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు ఆచూకీ తెలుసుకుని రక్షించాలి: గంటా
- విశాఖలో కొనసాగుతున్న స్టీల్ ప్లాంట్ కార్మికుల నిరసనలు
- లేఖ రాసి అదృశ్యమైన శ్రీనివాసరావు అనే ఉద్యోగి
- సూసైడ్ నోట్ రాయడం బాధాకరమన్న గంటా
- తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని హితవు
- కార్మికులకు అండగా ఉంటామని ఉద్ఘాటన
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు సూసైడ్ నోట్ రాసి అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. తన ప్రాణత్యాగంతో విశాఖ ఉక్కు గర్జన ఉద్యమం మళ్లీ ప్రారంభం కావాలని కోరుకుంటూ శ్రీనివాసరావు సూసైడ్ నోట్ రాసి కనిపించకుండా పోయాడు. దాంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ విషయంపై స్పందించారు.
కార్మికులు ప్రాణత్యాగాలు చేసే నిర్ణయం తీసుకోవద్దని, దయచేసి మనోధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు సూసైడ్ నోట్ రాయడం బాధాకరమని, పోలీసులు అతడి ఆచూకీ తెలుసుకుని రక్షించాలని గంటా కోరారు. కార్మికులకు అండగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి మన ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. దయచేసి ఎవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని హితవు పలికారు.