Mamata Banerjee: దేశ ఆర్థిక వ్యవస్థను మోదీ ధ్వంసం చేశారు: మమతా బెనర్జీ
- దేశంలోని అన్నింటినీ అమ్మేస్తున్నారు
- ఎక్కువ కాలం అధికారంలో ఉంటే దేశాన్నే అమ్మేస్తారు
- ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీదారు బీజేపీ
ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో దేశంలోని అన్నింటినీ మోదీ ప్రభుత్వం అమ్మేస్తోందని విమర్శించారు. ఏదో ఒకరోజు దేశాన్ని అమ్మేస్తుందని దుయ్యబట్టారు. బెంగాల్ కు వచ్చిన బీజేపీ నేతలు ఇక్కడ అభివృద్ధే లేదని అంటున్నారని... ఢిల్లీలో ఉండి వాళ్లు సాధించిందేమిటని ప్రశ్నించారు. బీజేపీ ఎక్కువ కాలం అధికారంలో ఉంటే దేశాన్ని అమ్మేస్తారని అన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీదారు బీజేపీ అని మమత విమర్శించారు. ఒక వ్యక్తి రూ. 500 దొంగిలిస్తేనే ఎంతో రాద్ధాంతం చేస్తారని... కోట్లాది రూపాయలను దోచుకున్న బీజేపీని ఏమనాలని ప్రశ్నించారు.
పెద్ద నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడాన్ని మోదీ ప్రారంభించారని... అది బ్యాంకులను అమ్మేయడం వరకు వచ్చిందని మమత అన్నారు. హల్దియా ఎయిర్ పోర్టును కూడా అమ్మేస్తామని త్వరలోనే కేంద్రం ప్రకటిస్తుందని ఎద్దేవా చేశారు. బెంగాల్ ప్రజలు అల్లర్లు లేని రాష్ట్రం కావాలని కోరుకున్నట్టయితే కనుక టీఎంసీకే ఓటు వేయాలని కోరారు.