Stalin: నా పేరు స్టాలిన్, కరుణానిధి బిడ్డను... నా తండ్రి ఏంచేశాడో నేనూ అదే చేస్తా: ఎన్నికల ప్రచారంలో డీఎంకే అధినేత
- తమిళనాడులో ఏప్రిల్ 6న ఎన్నికలు
- ప్రచారంలో వేగం పెంచిన డీఎంకే
- తిరునల్వేలిలో స్టాలిన్ ఎన్నికల సభ
- ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటానని ఉద్ఘాటన
- మేనిఫెస్టోనే తమ హీరో అని వెల్లడి
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విపక్ష డీఎంకే ప్రచారాన్ని ఉద్ధృతం చేసింది. డీఎంకే చీఫ్ స్టాలిన్ ప్రచారంలో పదును పెంచారు. తిరునల్వేలిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... "నా పేరు స్టాలిన్, కరుణానిధి కొడుకును. ఈ రాష్ట్రానికి మా నాన్న ఏంచేశాడో నేనూ అదే చేస్తా. ఏమేం హామీలు ఇస్తామో అన్నీ చేస్తాం" అని ఉద్ఘాటించారు.
"ఈ ఎన్నికల్లో డీఎంకే పార్టీకి సంబంధించినంతవరకు మా మేనిఫెస్టోనే హీరో. వాళ్ల (అన్నాడీఎంకే) మేనిఫెస్టో ఓ విలన్ లాంటిది, అదొక జోక్" అని పేర్కొన్నారు. అంతకుముందు, సీఎం పళనిస్వామి డీఎంకే అధినేత స్టాలిన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తానేదో పాక్కుంటూ వెళ్లి సీఎం పీఠం దక్కించుకున్నట్టుగా స్టాలిన్ అదేపనిగా దుష్ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. నేలపై పాకుతూ వెళ్లేందుకు నేనేమైనా బల్లినా, పామునా? అంటూ సీఎం వ్యాఖ్యానించారు.
తమిళనాడులో ఏప్రిల్ 6న ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో పార్టీలన్నీ తుపాను వేగంతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈసారి కమలహాసన్ నేతృత్వంలోని మక్కళ్ నీది మయ్యం పార్టీ కూడా అసెంబ్లీ బరిలో దిగుతుండడంతో ఫలితాలపై ఆసక్తి నెలకొంది.