Australia: అర్ధరాత్రుళ్లు ఇళ్లొదిలి.. ప్రాణాలు అరచేత పట్టుకుని.. బిక్కు బిక్కుమంటున్న ఆస్ట్రేలియా జనం: ఫొటోలు ఇవిగో
- న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రాన్ని ముంచెత్తిన వానలు
- నదులు పొంగి ఇళ్లు, రోడ్లను ముంచిన వరద
- 1960 నుంచి ఇలాంటి వానల్లేవన్న అధికారులు
- జాతీయ విపత్తుగా ప్రకటించిన ఆస్ట్రేలియా
ఇళ్లు మునిగిపోయాయి. రోడ్లు నదులయ్యాయి. నదులు పొంగి పొర్లాయి. మొత్తంగా ఆస్ట్రేలియాను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్టుగా న్యూసౌత్ వేల్స్ రాష్ట్రంలో నాలుగు రోజులుగా కుంభ వృష్టి ధాటికి జనం అర్ధరాత్రుళ్లు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సిడ్నీ సిటీ మొత్తం జలమయమైపోయింది.
ఎమర్జెన్సీకి ఫోన్లు చేసి కాపాడండంటూ జనం మొర పెట్టుకుంటున్నారు. చాలా మంది సురక్షిత ప్రాంతాలకు తరళి వెళుతున్నారు. ప్రస్తుతానికి ప్రాణ నష్టం లేకపోయినా.. వరదలు మరింత పెరిగితే ప్రాణ నష్టమూ జరిగే ముప్పు ఉందని సిడ్నీ అధికారులు చెబుతున్నారు.
1960 నుంచి ఇప్పటిదాకా ఎప్పుడూ ఇంతటి వర్షాలు పడలేదని అధికారులు, ప్రజలు చెబుతున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించింది. ఇటు న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం కూడా 16 ప్రకృతి విపత్తుల డిక్లరేషన్లపై సంతకాలు చేసింది. గురువారం చినుకు చినుకుగా మొదలైన వాన.. శనివారం నాటికి ఉగ్రరూపం దాల్చిందని, వరదలు పోటెత్తాయని అధికారులు చెబుతున్నారు.
నదుల్లో నీటి మట్టాలు అమాంతం పెరిగిపోవడం వల్లే వరదలు ముంచెత్తాయన్నారు. వరదల నుంచి కాపాడాలంటూ గురువారం నుంచి రాష్ట్ర అత్యవసర సేవల విభాగానికి దాదాపు 7 వేల ఫోన్లు వచ్చాయని అధికారులు చెప్పారు.
ప్రస్తుతం సిడ్నీ సహా వివిధ ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల చొప్పున వానలు పడుతున్నాయని, ఆదివారం 20 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా, వరదల కారణంగా కరోనా టీకా కార్యక్రమానికి అంతరాయం కలుగుతోంది. రాబోయే కొన్ని వారాల్లో 60 లక్షల మందికి టీకా వేయాలన్న లక్ష్యాన్ని చేరుకునేలా కనిపించడం లేదని, ఎక్కడికక్కడ వ్యాక్సిన్ల సరఫరా ఆగిపోయిందని న్యూసౌత్ వేల్స్ ప్రీమియర్ గ్లేడిస్ బర్జీక్లియన్ అన్నారు.