Shreyas Iyer: కౌంటీ క్రికెట్ ఆడనున్న శ్రేయాస్ అయ్యర్... లాంకషైర్ తో ఒప్పందం
- రాయల్ లండన్ కప్ లో ఆడనున్న అయ్యర్
- జూలై 22 నుంచి ఇంగ్లండ్ దేశవాళీ టోర్నీ
- లాంకషైర్ తో ఒప్పందం పట్ల అయ్యర్ హర్షం
- గతంలో ఈ క్లబ్ కు భారత్ నుంచి ఐదుగురు ప్రాతినిధ్యం
టీమిండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ ఆడనున్నాడు. ఇంగ్లండ్ దేశవాళీ జట్టు లాంకషైర్ శ్రేయాస్ అయ్యర్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది జరిగే రాయల్ లండన్ కప్ 50 ఓవర్ల టోర్నీలో అయ్యర్ లాంకషైర్ కు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఈ టోర్నీలో పాల్గొనేందుకు అయ్యర్ జూలై 15న ఓల్డ్ ట్రాఫోర్డ్ చేరుకోనున్నాడు. రాయల్ లండన్ కప్ జూలై 22 నుంచి ఆగస్టు 19 వరకు జరగనుంది. ఈ టోర్నీలో 18 జట్లు పాల్గొంటున్నాయి.
కాగా, భారత్ నుంచి లాంకషైర్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆరో ఆటగాడు శ్రేయాస్ అయ్యర్. గతంలో ఫారూఖ్ ఇంజినీర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, మురళీ కార్తీక్, దినేశ్ మోంగియా లాంకాషైర్ తరఫున ఇంగ్లండ్ లో కౌంటీ క్రికెట్ ఆడారు.
లాంకషైర్ కౌంటీ జట్టుతో ఒప్పందం పట్ల అయ్యర్ స్పందించాడు. భారత్ నుంచి హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించిన క్లబ్ కు తాను ఆడనుండడం తనకు లభించిన గౌరవంగా భావిస్తానని, లాంకషైర్ తరఫున భారత క్రికెట్ ఘనతర వారసత్వాన్ని కొనసాగిస్తానని పేర్కొన్నాడు.
ముంబయికి చెందిన అయ్యర్ ఇప్పటివరకు టీమిండియా తరఫున 21 వన్డేలు ఆడి 44.83 సగటుతో 807 పరుగులు చేశాడు. వాటిలో ఒక సెంచరీ, 8 అర్ధసెంచరీలు ఉన్నాయి. 29 టీ20ల్లో 3 అర్ధసెంచరీల సాయంతో 550 పరుగులు సాధించాడు.