Arvind Kejriwal: ఢిల్లీ ప్రభుత్వ అధికారాలకు కత్తెర.. కొత్త బిల్లుకు లోక్సభ ఆమోదం
- ఇకపై ఢిల్లీ ప్రభుత్వమంటే లెఫ్టినెంట్ గవర్నరే
- విపక్షాల ఆందోళన మధ్య ఎన్సీటీ బిల్లుకు ఆమోదం
- ఇది రాజ్యాంగ విరుద్ధమన్న కాంగ్రెస్, ఆప్
- కేంద్రంపై విరుచుకుపడిన కేజ్రీవాల్
ఢిల్లీ ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేసే కీలక బిల్లుకు లోక్సభ నిన్న ఆమోదం తెలిపింది. ‘ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (ఎన్సీటీ) సవరణ బిల్లు 2021’ ను కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల ఆందోళన మధ్య లోక్సభ ఆమోదించింది.
ఈ బిల్లు ప్రకారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు మరిన్ని అధికారాలు సంక్రమిస్తాయి. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అధికారాలు కోల్పోతుంది. ఇకపై ఢిల్లీ ప్రభుత్వమంటే ‘లెఫ్టినెంట్ గవర్నర్’ అని ఈ బిల్లు నిర్వచిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం తీసుకునే ఎలాంటి కార్యనిర్వాహక నిర్ణయాలు అమలు చేయాలన్నా తొలుత లెఫ్టినెంట్ గవర్నర్ను సంప్రదించాల్సి ఉంటుంది.
ఎన్సీటీ బిల్లును కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించాయి. ఎన్సీటీ బిల్లుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ బిల్లును ఆమోదించడం ద్వారా ఢిల్లీ ప్రజలను అవమానించారని ట్వీట్ చేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం నుంచి ఈ బిల్లు అధికారాలను లాగేసుకుని ఓడిన వ్యక్తులకు ఇస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విపక్షాల ఆరోపణలను బీజేపీ ఖండించింది. తామెవరి అధికారాలను లాక్కోవడం లేదని, లెఫ్టినెంట్ గవర్నర్కు కొత్తగా ఎలాంటి అధికారాలూ కట్టబెట్టడం లేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి అన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ కూడా పాలనాధికారేనని పేర్కొన్నారు. ప్రభుత్వ రోజువారీ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు ఆయనకు కూడా ఉందని స్పష్టం చేశారు. ఢిల్లీ పాలన విషయంలో ఉన్న అస్పష్టతను సరిచేసేందుకే ఈ బిల్లును తీసుకొచ్చినట్టు వివరించారు.