New Delhi: వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా సోకిన మహమ్మారి .. ఢిల్లీలో నర్స్, లక్నోలో వైద్యుడికి పాజిటివ్
- నిర్ణీత సమయంలో వ్యాక్సిన్ డోసులు తీసుకున్నా సోకిన మహమ్మారి
- యూపీలో ఇలా ఇదే తొలి కేసు
- ఐసోలేషన్‌లో వైద్యుడు
నిర్ణీత సమయంలో కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా ఓ వైద్యుడు, నర్స్ కరోనా బారినపడ్డారు. ఢిల్లీలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్స్ ఒకరు జనవరి 18న కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు. 28 రోజుల వ్యవధి తర్వాత ఫిబ్రవరి 17న రెండో డోసు తీసుకున్నారు. తాజాగా, ఆమెలో లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా, కరోనా సంక్రమించినట్టు తేలింది.
ఉత్తరప్రదేశ్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. లక్నోలోని ఎస్పీఎం సివిల్ ఆసుపత్రి ఎమర్జెన్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నితిన్ మిశ్రా ఫిబ్రవరి 15న తొలి డోసు, ఈ నెల 16న కోవాగ్జిన్ టీకా రెండో డోసు తీసుకున్నారు. తాజాగా, ఆయన చేయించుకున్న పరీక్షల్లో కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో వెంటనే ఆయన ఐసోలేషన్లోకి వెళ్లిపోయారు. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా వైరస్ సంక్రమించిన ఘటన యూపీలో ఇదే మొదటిదని యూపీ మెడికల్ హెల్త్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ డీఎస్ నేగి తెలిపారు.