America: వారం రోజుల్లో రెండోసారి.. అమెరికాలో మళ్లీ గర్జించిన తుపాకి, ఆరుగురి మృతి
- కొలరాడోలోని బౌల్డర్‌లో ఘటన
- సూపర్ మార్కెట్లోకి దూరి దుండగుడి కాల్పులు
- మృతుల్లో పోలీసు అధికారి
- కొలరాడో గవర్నర్ దిగ్భ్రాంతి
అమెరికాలో తుపాకులు గర్జిస్తూనే ఉన్నాయి. అట్లాంటాలోని మసాజ్ పార్లర్లపై కాల్పుల ఘటనను మర్చిపోకముందే కొలరాడో రాష్ట్రంలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. బౌల్డర్‌లోని ఓ సూపర్ మార్కెట్లోకి చొరబడిన గుర్తు తెలియని దుండగుడు వినియోగదారులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. కాల్పుల శబ్దాలు విని స్టోర్‌లోని వినియోగదారులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. నిన్న మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
బౌల్డర్‌లోని కింగ్ సూపర్ మార్కెట్లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడని, పోలీసు అధికారి సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు చెప్పారు. కాల్పుల ఘటనపై కొలరాడో గవర్నర్ జేర్డ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, ఇటీవల అట్లాంటాలోని రెండు వేర్వేరు మసాజ్ సెంటర్లపై దుండగులు జరిపిన కాల్పుల్లో 8 మంది మరణించారు. వీరిలో ఆరుగురు ఆసియన్ అమెరికన్లు ఉన్నారు.