Gaganyaan: రష్యాలో శిక్షణను పూర్తి చేసుకున్న భారత గగన్ యాన్ వ్యోమగాములు!
- గగన్ యాన్ ద్వారా నింగిలోకి వ్యోమగాములను పంపనున్న ఇస్రో
- ఈ ప్రాజెక్టు కోసం నలుగురు ఐఏఎఫ్ పైలట్లకు రష్యాలో శిక్షణ
- సెకండ్ స్టేజ్ లో ఇండియాలోనే మాడ్యూల్ ట్రైనింగ్
ఇప్పటికే ఎన్నో ఘన విజయాలను సొంతం చేసుకుని, మన దేశ కీర్తిని నలు దిశలా చాటిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 'ఇస్రో'... గగన్ యాన్ పేరుతో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టులో భాగంగా మన దేశానికి చెందిన ఆస్ట్రోనాట్లను ఇస్రో తొలిసారి నింగిలోకి పంపబోతోంది. మధ్యలో కరోనా మహమ్మారి ఆటంకం కలిగించకపోయి ఉంటే ఇప్పటికే సర్వం సిద్ధం అయ్యేది. కరోనా వల్ల ప్రాజెక్ట్ ఆలస్యమైంది.
మరోవైపు మన వ్యోమగాములు మాత్రం శిక్షణను పూర్తి చేసుకున్నారు. రష్యాలోని మాస్కో సమీపంలో ఉన్న గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్ లో వీరు ఏడాది శిక్షణను పూర్తి చేసుకున్నారు.
మన ఆస్ట్రోనాట్లకు ట్రైనింగ్ ఇచ్చే ఒప్పందంపై ఇండియా, రష్యాలు 2019 జూన్ లో సంతకాలు చేశాయి. వ్యోమగాములుగా నలుగురు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లను ఈ ప్రాజెక్టు కోసం భారత్ ఎంపిక చేసింది. వీరిలో ఒకరు గ్రూప్ కెప్టెన్ కాగా, మిగిలిన ముగ్గురు వింగ్ కమాండర్లు. వీరికి 2020 ఫిబ్రవరి 10న ట్రైనింగ్ ప్రారంభమైంది.
ఇస్రో అధికారులు ఇంతకు ముందు ప్రకటించిన ప్రకారం... రష్యాలో శిక్షణ పూర్తయిన తర్వాత ఇండియాలోనే వీరికి మాడ్యూల్ కు చెందిన ట్రైనింగ్ ఇస్తారు. మాడ్యూల్ లో ఎలా పని చేయాలి? దాన్ని ఎలా నియంత్రించాలి? తదితర అంశాలను ఈ శిక్షణలో వారు నేర్చుకుంటారు. గగన్ యాన్ కోసం భారత ప్రభుత్వం రూ. 10 వేల కోట్ల బడ్జెట్ ను కేటాయించింది.