Assom: ‘సరైన ఎన్నార్సీ’ని అమలు చేస్తాం: అసోం ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ హామీ
- ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో 10 లక్షల ఉద్యోగాలు
- బ్రహ్మపుత్ర వరదలపై ప్రత్యేక ప్రణాళిక
- భూమి లేని పేదలకు పట్టాల పంపిణీ
అసోంలో గెలుపే లక్ష్యంగా బీజేపీ దూసుకుపోతోంది. ఎన్నార్సీ సహా పది కీలక హామీలతో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మంగళవారం పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా గువాహటీలో నిర్వహించిన కార్యక్రమంలో మేనిఫెస్టోను విడుదల చేశారు. విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నా.. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్నార్సీ)నీ మేనిఫెస్టోలో చేర్చారు. ‘సరైన ఎన్నార్సీ’నే అమలు చేస్తామంటూ హామీ ఇచ్చారు. ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో కలిపి పది లక్షల ఉద్యోగాలు ఇస్తామని పేర్కొన్నారు.
ఇవీ ఆ పది కీలక హామీలు...
- ప్రజలను బ్రహ్మపుత్ర నది వరదల నుంచి కాపాడేందుకు ‘బ్రహ్మపుత్ర మిషన్’
- మరింత మందికి ‘అరుణోదయ్’ పథకం. అందులో భాగంగా 30 లక్షల మందికి నెలకు రూ.3 వేల చొప్పున ఆర్థిక సాయం
- నామఘర్ (అసోం ప్రజల ప్రార్థనా మందిరాలు)లకు రూ.రెండున్నర లక్షల సాయం
- చిన్నారులకు నాణ్యమైన విద్య. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చిన్నారులందరికీ ఉచిత విద్య. ఎనిమిదో తరగతి ఆపైన చదివే విద్యార్థినులందరికీ సైకిళ్లు
- ‘సరైన ఎన్నార్సీ’. నిజమైన భారత పౌరులకు ఎలాంటి నష్టమూ లేకుండా రక్షణ. అసోంను అసోంలాగా ఉంచేందుకు చొరబాటుదారుల అడ్డగింత
- ప్రజల రాజకీయ హక్కులను కాపాడేందుకు డీ లిమిటేషన్ ప్రక్రియ వేగవంతం
- ఆత్మనిర్భర్ అసోం. సూక్ష్మ, స్థూల స్థాయుల్లో ప్రణాళికలు
- అసోం యువతకు ఉద్యోగ అవకాశాలు. 2 లక్షల మందికి ఉద్యోగాలు. 2022 మార్చి 31 నాటికి లక్ష మందికి ఉద్యోగ కల్పన. ప్రైవేట్ రంగంలో 8 లక్షల ఉద్యోగాలు.
- ఎంట్రప్రెన్యూర్ షిప్ (ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు)ను ప్రోత్సహించేందుకు గానూ స్వామి వివేకానంద యువత ఉపాధి పథకం. రాబోయే ఐదేళ్లలో ఏటా రెండు లక్షల మంది యువతను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు తోడ్పాటు
- భూమి లేని నిరుపేదలందరికీ పట్టాల పంపిణీ