KTR: ఆరున్నరేళ్లలో తెలంగాణకు కేంద్రం అణా పైసా సాయం చేయలేదు: కేటీఆర్
- పునర్విభజన చట్టంలో పారిశ్రామికీకరణకు సాయం ఉంది
- రాయితీలు ఇస్తామని పేర్కొన్నారు
- ఇప్పటికయినా ప్రత్యేక రాయితీలు ఇవ్వాలి
- ఆత్మనిర్భర్ ప్యాకేజీ ఏమైందో ఎవ్వరికీ తెలియదు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సందర్భంగా టీఎస్ ఐపాస్ కింద పరిశ్రమలపై సభ్యులు ప్రశ్నలు అడుగుతుండగా, ప్రభుత్వం సమాధానాలు ఇస్తోంది. ఈ సందర్భంగా కేటీఆర్ పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఆరున్నరేళ్లలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అణా పైసా కూడా సాయం చేయలేదని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామికీకరణ కోసం సాయం చేయాలని, రాయితీలు ఇవ్వాలని పేర్కొన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. అయినప్పటికీ ఎలాంటి సాయం అందలేదని తెలిపారు. కేంద్ర సర్కారు ఇప్పటికయినా ప్రత్యేక రాయితీలను ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు పార్లమెంట్లో చేసిన చట్టాన్నే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రం తెచ్చిన రూ.20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ ప్యాకేజీ ఏమైందో ఎవరికి తెలియదని ఆయన చెప్పారు. దాని వల్ల తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని, వీధి వ్యాపారులకు మాత్రమే రూ.10 వేల రుణాలు ఇచ్చారని వివరించారు.