Harish Rao: తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు ఇది: హరీశ్ రావు
- కూడవెళ్లి వాగులోకి గోదావరి జలాల విడుదల
- ఈ వాగుకు కేసీఆర్ పునర్జన్మను ప్రసాదించారన్న హరీశ్
- విమర్శలకు తాము పనితీరుతో సమాధానం చెపుతామని వ్యాఖ్య
ముఖ్యమంత్రి కేసీఆర్ పై మంత్రి హరీశ్ రావు ప్రశంసల జల్లు కురిపించారు. కూడవెళ్లి వాగుకు కొత్త దశ, దిశ చూపి పునర్జన్మను ప్రసాదించారని కొనియాడారు. గోదావరి జలాలను కూడవెళ్లి వాగులోకి ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ, గుక్కెడు మంచినీళ్ల కోసం తల్లడిల్లిన ఈ ప్రాంతం కాళేశ్వరం ప్రాజెక్టుతో ఈరోజు మండుటెండల్లో కూడా జలకళను సంతరించుకుందని అన్నారు.
గోదావరి జలాలను కూడవెళ్లి వాగులోకి విడుదల చేసిన ఈరోజు తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని హరీశ్ అన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు పనులను ప్రారంభించిన రోజున హేళన చేసినవారు... ప్రస్తుత ఫలితాలను చూసి ఈర్ష్య పడుతున్నారని చెప్పారు. రైతులంతా చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. సొంత రాష్ట్రాన్ని సాధించుకోవడం వల్లే ఇదంతా సాకారమయిందని చెప్పారు. ప్రతిపక్షాల విమర్శలకు తాము పనితీరుతో సమాధానం చెపుతామని అన్నారు.