Mithun Chakraborty: బీజేపీ తుది జాబితాలోనూ మిథున్‌ చక్రవర్తికి దక్కని చోటు!

Mithun didnot find place even in final list
  • ఇటీవలే బీజేపీలో చేరిన మిథున్‌
  •  ఓ దశలో సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని ఊహాగానాలు
  • చివరకు అసెంబ్లీ సీటు దక్కకపోవడంతో సర్వత్రా చర్చ
  • ఆయన ఆశించిన రాష్‌బెహారీ స్థానం సుబ్రతా సాహాకి కేటాయింపు  
ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి  తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఓ దశలో ఆయనని బెంగాల్ సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రకటించే అవకాశం ఉందన్న ఊహాగానాలూ వెలువడ్డాయి. తీరా చూస్తే ఆయనకు కనీసం అసెంబ్లీ టిక్కెట్ కూడా దక్కలేదు. తుది జాబితాలో మిథున్ పేరు ఉంటుందని ఆశించినా.. మొండిచేయే మిగిలింది. మంగళవారం 13 మంది పేర్లతో విడుదల చేసిన బీజేపీ అభ్యర్థుల తుది జాబితాలో మిథున్ చక్రవర్తి పేరు లేకపోవడం గమనార్హం.

ఇంతకుముందు విడుదల చేసిన జాబితాల్లో ఆయన పేరు లేకపోయినప్పటికీ.. రాష్‌బెహారీ స్థానం నుంచి మిథున్‌కే అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆ స్థానంలో ఆయనకు బదులు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సుబ్రతా సాహాని బరిలోకి దింపారు.  ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఏర్పడ్డ క్లిష్ట పరిస్థితుల్లో సుబ్రత కశ్మీర్‌ ఇంచార్జీగా పని చేశారు.

కాగా, మార్చి 7న కోల్‌కతాలోని బ్రిగేడ్ పెరేడ్ మైదానంలో బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మిథున్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ప్రధాని నరేంద్రమోదీతో కలిసి వేదికను పంచుకున్నారు. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీకి మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 మధ్య ఎనిమిది దశల్లో పోలింగ్ జరగనుంది. ఫలితాలు మే 2న విడుదల కానున్నాయి.
Mithun Chakraborty
BJP
West Bengal
assembly polls

More Telugu News