Telangana: సినిమా హాల్స్ మూసేయండి: తెలంగాణ సర్కారుకు అధికారుల నివేదిక
- ఆలస్యం చేస్తే మరింత ముప్పు తప్పదు
- మూసివేత వద్దనుకుంటే కెపాసిటీని తగ్గించండి
- కేసులు పెరగడానికి సినిమాలు కూడా కారణమే
- ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు
కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో సినిమా థియేటర్లను మూసి వేయాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ విషయంలో ఆలస్యం చేస్తే మరింత ముప్పు తప్పదని కూడా ఉన్నతాధికారులు ప్రభుత్వాన్ని హెచ్చరించినట్టు సమాచారం. మూసివేత వద్దని భావిస్తే, సీటింగ్ కెపాసిటీని అన్ లాక్ లో భాగంగా తీసుకున్న నిర్ణయాల మేరకు 50 శాతానికి తగ్గించాలని కూడా అధికారులు సూచించారు.
ఇప్పుడు రాష్ట్రంలో రెండో వేవ్ కొనసాగుతోందని గుర్తు చేసిన ఆరోగ్య శాఖ అధికారులు, పరిస్థితి ఇలానే ఉంటే కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వరుసగా కొత్త సినిమాలు వస్తుండటంతో, 90 శాతం వరకూ థియేటర్లు నిండిపోతున్నాయని, సినిమా హాల్స్ లో మాస్క్ లను ధరించకుండా, పక్కపక్కనే కూర్చోవడం, తలుపులు మూసివేసి, ఎయిర్ కండిషనింగ్ అమలు చేస్తుండటం కూడా కేసులు పెరగడానికి కారణమని అధికారులు తమ నివేదికలో అభిప్రాయపడ్డారు.
సినిమా హాల్స్ తో పాటు జిమ్ లు, ప్రజలు అధికంగా గుమికూడే వివిధ కార్యకలాపాలపై కూడా తాత్కాలికంగా నిషేధం విధించాలని ప్రభుత్వానికి సూచించామని అధికార వర్గాలు తెలిపాయి.
కాగా, ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ నుంచి వచ్చిన నివేదికను అనుసరించి నేటి నుంచి రాష్ట్రంలో పాఠశాలలను మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలోనూ ఆరోగ్య శాఖ కొంత అసహనంగానే ఉన్నట్టు సమాచారం. స్కూళ్ల మూసివేతపై నిర్ణయం తీసుకోవాలని తాము పది రోజుల క్రితమే నివేదిక ఇచ్చినా, ప్రభుత్వం ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నదని అంటున్న అధికారులు, సినిమా హాల్స్ విషయంలో సాధ్యమైనంత త్వరగా ఓ నిర్ణయానికి రావాలని కోరుతున్నారు.