Telugudesam: నారా భువనేశ్వరి, లోకేశ్ టార్గెట్ గా తప్పుడు ప్రచారం... డీజీపీకి తెలుగుదేశం ఫిర్యాదు!
- సోషల్ మీడియా కథనాలపై చర్యలు తీసుకోవాలి
- లేకుంటే హైకోర్టును ఆశ్రయిస్తాం
- తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆగ్రహం
కనీస అర్హతలు లేకపోయినా నారా లోకేశ్ స్టాన్ ఫోర్డ్ వర్శిటీలో చేరి చదువుకున్నారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ, తెలుగుదేశం పార్టీ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో లోకేశ్ తో పాటు ఆయన తల్లి నారా భువనేశ్వరి లక్ష్యంగా ఆరోపణలు వస్తున్నాయంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదుపై తక్షణం చర్యలు తీసుకోకుంటే, రెండు, మూడు రోజుల్లో హైకోర్టును ఆశ్రయిస్తామని వారు స్పష్టం చేశారు.
స్టాన్ ఫోర్డ్ వర్శిటీలో సీటు కోసం లోకేశ్ కు ఎవరో డబ్బులు చెల్లించారని ప్రచారం జరుగుతోందని, అయితే, ఆ డబ్బును నారా భువనేశ్వరి బ్యాంకు ఖాతా నుంచే చెల్లించారనడానికి ఆధారాలు, రసీదులు తమ వద్ద ఉన్నాయని, వాటిని డీజీపీకి సమర్పించి స్పష్టం చేశారు. లోకేశ్ స్టాన్ ఫోర్డ్ లో ఉన్న సమయంలో కాలేజీకి రాసిన లెటర్ కాపీలు కూడా ఉన్నాయని, నిజాలన్నీ కళ్ల ముందుంటే, తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.