SA Bobde: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ.. ప్రతిపాదించిన జస్టిస్ బోబ్డే
- కేంద్ర న్యాయశాఖకు జస్టిస్ బోబ్డే లేఖ
- వచ్చే నెల 23న జస్టిస్ బోబ్డే పదవీ విరమణ
- జస్టిస్ బోబ్డే తర్వాత జస్టిస్ ఎన్వీ రమణ మోస్ట్ సీనియర్
- 2022, ఆగస్టు 26న రిటైర్ కానున్న ఎన్వీ రమణ
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ పేరును సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు జస్టిస్ బోబ్డే లేఖ రాశారు. ఆయన వచ్చే నెల 23న పదవీ విరమణ చేయనున్నారు.
ఈ నేపథ్యంలో తదుపరి సీజేఐ పేరును ప్రతిపాదించాలని వారం రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఆయనను కోరింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ మేరకు జస్టిస్ బోబ్డేకు లేఖ రాశారు. దీంతో సాధారణ ప్రక్రియ ప్రకారం బోబ్డే ఈ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టులో జస్టిస్ బోబ్డే తర్వాత జస్టిస్ ఎన్వీ రమణ మోస్ట్ సీనియర్ జడ్జి. ఎన్వీ రమణ 2022, ఆగస్టు 26న రిటైర్ అవుతారు.
జస్టిస్ రమణ 1957, ఆగస్టు 27న ఆంధ్రప్రదేశ్‌లోని ఓ వ్యవసాయం కుటుంబంలో జన్మించారు. 2000, జూన్‌లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు శాశ్వత జడ్జిగా నియమితుడయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించే ముందు ఢిల్లీ హైకోర్టు జడ్జిగానూ బాధ్యతలు నిర్వర్తించారు.
కాగా, జస్టిస్ బోబ్డే 2019 నవంబరులో సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ (రిటైర్డ్) రంజన్ గొగొయ్ స్థానంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు 48వ సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ పేరును ఆయన ప్రతిపాదించారు.