Talasani: తెలంగాణలో థియేటర్లు బంద్ చేస్తారన్న ప్రచారంపై స్పందించిన మంత్రి తలసాని!
- ఈ ప్రచారంలో నిజంలేదు
- సినిమా థియేటర్లు యథావిధిగా కొనసాగుతాయి
- కొవిడ్ నిబంధనలు పాటించాలి
- వదంతులు నమ్మకూడదు
తెలంగాణలో మళ్లీ కరోనా విజృంభణ నేపథ్యంలో విద్యా సంస్థలను బంద్ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో థియేటర్లను కూడా బంద్ చేస్తారని వదంతులు వస్తున్నాయి. దీనిపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ... థియేటర్లు బంద్ చేస్తారన్న ప్రచారంలో నిజంలేదని చెప్పారు.
సినిమా థియేటర్లు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. అయితే, థియేటర్ల యజమానులు సినిమా హాళ్లలో కొవిడ్ నిబంధనలు పాటించేలా పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. థియేటర్లను మూసివేస్తారంటూ వస్తోన్న ప్రచారాన్ని నమ్మకూడదని ఆయన ప్రజలకు సూచించారు.
లక్షలాది మంది జీవితాలు సినీ పరిశ్రమపై ఆధారపడి ఉన్నాయని ఆయన చెప్పారు. అందరి ప్రయోజనాలను, ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. అందరూ కరోనా నిబంధనలను పాటించాలని పిలుపునిచ్చారు.