Supreme Court: ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పిటిషన్​ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ

Issue is serious but why not go to HC SC refuses to hear Param Bir Singhs plea

  • హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్న
  • బాంబే హైకోర్టులోనే తేల్చుకోవాలని ఆదేశం
  • కేసు తీవ్రమైనదేనని కామెంట్
  • హోం మంత్రి వ్యవహారంపై సీబీఐ విచారణ చేయించాలన్న పరంబీర్

ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాల్సిందిగా పోలీస్ అధికారి సచిన్ వాజేకి మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ టార్గెట్ పెట్టారని ఆరోపించిన పరంబీర్ సింగ్.. ఆ వ్యవహారంపై సీబీఐ విచారణ చేయించాల్సిందిగా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.

నేడు ఆయన వ్యాజ్యాన్ని విచారించిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. ఇది చాలా తీవ్రమైన విషయమని పేర్కొంది. అయితే, సుప్రీంకోర్టుకు వచ్చే ముందు హైకోర్టులో ఈ విషయాన్ని తేల్చుకోవాలని పరంబీర్ సింగ్ కు సూచించింది. ‘‘పిటిషనర్ పేర్కొన్న సమస్య చాలా తీవ్రమైనది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, మీరు హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదు?’’ అని ప్రశ్నించింది.

226వ అధికరణం ప్రకారం కేసును హైకోర్టులో తేల్చుకోవాలని ఆదేశించింది. అంత తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటున్న అనిల్ దేశ్ ముఖ్ ను కేసులో ప్రతివాదిగా ఎందుకు చేర్చలేదని పరంబీర్ సింగ్ ను ప్రశ్నించింది. దీంతో వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుంటున్నామని, బాంబే హైకోర్టుకు వెళతామని పరంబీర్ తరఫున కేసు వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ ధర్మాసనానికి తెలిపారు. ఆయన విజ్ఞప్తిని మన్నించిన ధర్మాసనం.. హైకోర్టులో ఈ విషయాన్ని తేల్చుకోవాల్సిందిగా మరోసారి సూచించింది.

  • Loading...

More Telugu News