Khammam District: లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఉప తహసీల్దార్.. పండుగ చేసుకున్న రైతులు
- ఖమ్మం జిల్లా వేంసూరు తహసీల్దార్ కార్యాయలంలో ఘటన
- సర్వేచేసి నివేదిక ఇచ్చేందుకు రూ. 2 లక్షల లంచం డిమాండ్
- లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన ఉప తహసీల్దార్, సర్వేయర్
- ఉపేందర్ ఇంటి నుంచి 37,17,590 నగదు, 30 తులాల బంగారం స్వాధీనం
తహసీల్దార్ కార్యాలయంలో రైతు నుంచి లక్ష రూపాయల లంచం తీసుకుంటుండగా ఉప తహసీల్దార్, సర్వేయర్‌లు రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడ్డారు. విషయం తెలిసిన రైతులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఖమ్మం జిల్లా వేంసూరు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిందీ ఘటన.
జిల్లాలోని సత్తుపల్లికి చెందిన తోట సాంబశివరావు, ఆయన కుటుంబ సభ్యుల పేరుతో వేంసూరు మండలంలో 25 ఎకరాల మామాడితోట ఉంది. ఈ భూమిని ఇరుగుపొరుగువారు ఆక్రమిస్తుండడంతో సర్వే చేసి నివేదిక ఇవ్వాలంటూ సాంబశివరావు అధికారులను కోరారు. ఉపతహసీల్దార్ ఉపేందర్, సర్వేయర్ గువేశ్‌లు ఇందుకోసం రూ. 2 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో అంత ఇచ్చుకోలేనని, లక్షన్నర మాత్రమే ఇస్తానని, అది కూడా తొలుత లక్ష రూపాయలు మాత్రమే ఇస్తానని సాంబశివరావు వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు.
తర్వాత సాంబశివరావు ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారిచ్చిన సలహా ప్రకారం నిన్న మధ్యాహ్నం సాంబశివరావు లక్ష రూపాయలు తీసుకుని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి డబ్బులు తీసుకొచ్చినట్టు చెప్పారు. వారు ఆ సొమ్మును బయట ఉన్న కారులో పెట్టమని చెప్పారు. అప్పటికే అక్కడ మాటువేసిన ఏసీబీ అధికారులు ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీసి ఆధారాలతో ఉప తహసీల్దార్, సర్వేయర్‌లను అరెస్ట్ చేశారు.
అనంతరం ఖమ్మంలోని ఉపేందర్ ఇంట్లో తనిఖీలు నిర్వహించగా రూ. 37,17,590 నగదు, 30 తులాల బంగారం, విలువైన డాక్యుమెంట్లు లభించాయి. ఉపేందర్, గురవేశ్ అరెస్ట్ విషయం తెలిసిన సమీప గ్రామాల రైతులు తహసీల్దార్ కార్యాలయం వద్ద సంతోషంతో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.