Maharashtra: నాపై విచారణ జరిపించండి: ఉద్ధవ్ థాకరేకు లేఖ రాసిన మహారాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్
- అనిల్ పై సంచలన ఆరోపణలు చేసిన పరమ్ బీర్ సింగ్
- విచారణకు ఆదేశిస్తే స్వాగతిస్తాను
- మరాఠీలో ట్వీట్ చేసిన అనిల్ దేశ్ ముఖ్
తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరుతూ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేకు లేఖను రాసినట్టు మహారాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. సచిన్ వాజేపై వసూళ్లకై ఒత్తిడి పెంచారంటూ అనిల్ దేశ్ ముఖ్ పై ముంబై పోలీస్ మాజీ చీఫ్ పరమ్ బీర్ సింగ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో, "నాపై పరమ్ బీర్ సింగ్ చేసిన ఆరోపణలను విచారించి నిజానిజాలను వెలుగులోకి తేవాలని ముఖ్యమంత్రిని కోరాను. ఈ విషయంలో ముఖ్యమంత్రి విచారణకు ఆదేశిస్తే, నేను స్వాగతిస్తాను. సత్యమేవ జయతే" అని మరాఠీలో అనిల్ దేశ్ ముఖ్ ట్వీట్ చేశారు.
ఇటీవల పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ ఇంటి ముందు లభించిన కారులో పేలుడు పదార్ధాలు బయటపడగా, ఈ కేసులో అసిస్టెంట్ పోలీస్ ఇనస్పెక్టర్ సచిన్ వాజేపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. సచిన్ వాజే నెలకు రూ. 100 కోట్లు వసూలు చేయాలని అనిల్ దేశ్ ముఖ్ ఆదేశించారని, అందుకోసం ఒత్తిడి పెంచారని పరమ్ బీర్ సింగ్ ఆరోపిస్తూ, ముఖ్యమంత్రికి లేఖ రాసిన సంగతి తెలిసిందే.
ఈ లేఖ వెలుగులోకి వచ్చిన తరువాత బీజేపీ నేతలు... ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర ఆరోపణలు చేశారు. బుధవారం నాడు గవర్నర్ ను కలిసిన ఆయన, ఉద్ధవ్ పాలన అవినీతితో నిండిపోయిందని ఫిర్యాదు చేశారు. అధికారంలో ఉండేందుకు మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి అర్హత లేదని ఆయన ఆరోపించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, కట్టడికి మరిన్ని చర్యలు తీసుకోవాలని, అవినీతి ఆరోపణలపైనా విచారణకు ఆదేశించాలని కోరామని బీజేపీ నేత సుధీర్ ముంగంటివార్ వెల్లడించారు.