India: సెషన్ ఆరంభంలోనే భారీ నష్టాల దిశగా స్టాక్ మార్కెట్!
- అర లక్ష దాటిన కొత్త కరోనా కేసులు
- అమ్మకాల వైపు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
- దాదాపు ఒక శాతం నష్టంలో సూచీలు
ఇండియాలో కరోనా కొత్త కేసుల సంఖ్య ఒక్క రోజులోనే అర లక్షకు పైగా దాటడం, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పై ప్రభావం చూపింది. తొలుత నామమాత్రపు లాభాలతో ప్రారంభమైన సూచీలు, ఆ వెంటనే ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన అమ్మకాల ఒత్తిడితో భారీ నష్టాల దిశగా సాగుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్ తీవ్ర ఒత్తిడితో ఉంది. దాదాపు అన్ని బ్యాంకుల ఈక్విటీ షేర్లూ పడిపోయాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్, కీలకమైన 49 వేల స్థాయి వద్ద మద్దతును కూడగట్టుకోలేక పోయింది. ఇదే సమయంలో నిఫ్టీ 14,500 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఈ ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ సూచిక క్రితం ముగింపుతో పోలిస్తే, 464 పాయింట్లు నష్టపోయి, 0.94 శాతం తక్కువగా 4,715 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ, 131 పాయింట్లు పడిపోయి, 0.90 శాతం నష్టంతో 14,417 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
సెన్సెక్స్ - 20 ఇండెక్స్ లో ఒక్క ఓఎన్జీసీ మాత్రమే ఒక్క శాతం లాభంలో కొనసాగుతుండగా, మిగతా 29 కంపెనీలూ నష్టాల్లోనే ఉండటం గమనార్హం. బజాజ్ ఫైనాన్స్ అత్యధికంగా 2 శాతానికి పైగా నష్టంలో ఉండగా, మిగతా కంపెనీలు 0.05 నుంచి 1.90 శాతం వరకూ నష్టాల్లో ఉన్నాయి. ఇక ఈ ఉదయం గ్లోబల్ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. జకార్తా కాంపోజిట్, షాంగై కాంపోజిట్ లు నష్టాల్లో ఉండగా, మిగతా దేశాల సూచీలు స్వల్ప లాభాల్లో ఉన్నాయి.