Corona Virus: కరోనా నుంచి కోలుకున్న కొందరిలో కొన్నేళ్ల వరకు క్రియాశీలకంగా యాంటీబాడీలు
- వెల్లడించిన సింగపూర్ పరిశోధకులు
- 164 మంది కరోనా రోగులపై అధ్యయనం
- కొందరిలో మాత్రం త్వరగా నశిస్తోన్న యాంటీబాడీలు
కరోనా వైరస్ గురించి కొనసాగిస్తోన్న పరిశోధనల్లో మరిన్ని కొత్త విషయాలు బయటపడ్డాయి. కొందరిలో కరోనా వైరస్ రెండోసారి సోకుతుండడం ఆందోళన కూడా కలిగిస్తోంది. వైరస్ సోకి కోలుకున్న వారిలో యాంటీ బాడీలు ఎంతకాలం ఉంటాయన్న విషయంపై సింగపూర్ లోని డ్యూక్-ఎన్‌యూఎస్ మెడికల్ స్కూల్ పరిశోధకులు అధ్యయనం చేశారు.
కొందరిలో కొన్ని రోజుల పాటు యాంటీబాడీలు ఉంటుండగా, మరి కొన్నేళ్ల పాటు క్రియాశీలకంగా ఉంటాయని చెప్పారు. తొమ్మిది నెలలపాటు 164 మంది కరోనా రోగుల రక్త నమూనాలను సేకరించి, వాటిని పరీక్షించి పరిశోధకులు అధ్యయనం చేశారు. యాంటీబాడీల విడుదలలో హెచ్చుతగ్గుల ప్రాతిపదికగా వారిని ఐదు గ్రూపులుగా విభజించారు.
మొదటి గ్రూపు వారిలో శరీరంలో యాంటీబాడీలు అస్సలు లేవు. రెండో గ్రూపు వారిలో ప్రతిరక్షకాలు వచ్చి త్వరగా నశించాయి. అలాగే, మూడో గ్రూపు వారిలో ఆరు నెలల తర్వాత కూడా యాంటీబాడీలు ఉన్నాయి.
నాలుగో గ్రూపు వారిలో 180 రోజుల తర్వాత స్వల్ప సంఖ్యలో ప్రతిరక్షకాలు తగ్గాయి. ఇక ఐదో గ్రూపు వారిలో మాత్రం సుదీర్ఘకాలం పాటు గణనీయస్థాయిలో యాంటీబాడీలు క్రియాశీలకంగా ఉన్నాయి. అయితే, తక్కువ యాంటీబాడీలు విడుదలైన వారి శరీరంలోని టీ-సెల్స్‌తో బలమైన రోగ నిరోధక శక్తి వచ్చిందని చెప్పారు.