Karnataka: దమ్ముంటే.. ఏకపత్నీవ్రతులమని నిరూపించుకోండి: ఎమ్మెల్యేలందరికీ కర్ణాటక మంత్రి సవాల్
- పరీక్ష పెడితే అందరి బాగోతాలు బయటపడతాయని కామెంట్లు
- ఎమ్మెల్యేల ప్రైవేట్ లైఫ్ పై దర్యాప్తు చేయిద్దామని సవాల్
- ఎవరెవరికి సంబంధాలున్నాయో తేలుద్దామంటూ వ్యాఖ్యలు
- అసహనం వ్యక్తం చేసిన స్పీకర్, ప్రతిపక్ష సభ్యులు
- మాటలను వెనక్కు తీసుకున్న ఆరోగ్య మంత్రి
‘వివాహేతర’ సంబంధాలపై కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే ఎమ్మెల్యేలంతా ఏకపత్నీవ్రతులమని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ‘‘అసెంబ్లీలోని 225 మంది ఎమ్మెల్యేలు.. తమకేం వివాహేతర సంబంధాలు లేవని నిరూపించుకోవాలి. అందుకు ఏకపత్నీవ్రతులమన్న పరీక్షను ఎదుర్కోవాలి’’ అని ఆరోగ్య శాఖ మంత్రి కె. సుధాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే, అధికార పార్టీ సహా విపక్ష ఎమ్మెల్యేల నుంచి తీవ్రమైన విమర్శలు రావడం.. వారు ఆందోళనకు దిగడంతో ఆ మాటలను కాసేపటికే వెనక్కు తీసుకున్నారు.
తనతో సహా ఆరుగురు మంత్రులు రాజీనామా చేయాలంటూ ఆరు రోజులుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తుండడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సుధాకర్.. ఏకపత్నీవ్రత పరీక్షను పెడితే పతివ్రతల్లా మాట్లాడుతున్న అందరి బాగోతాలూ బయటపడతాయని వ్యాఖ్యానించారు. ‘‘మర్యాద రామన్నల్లా.. శ్రీరామచంద్రుల్లా మాట్లాడుతున్న వారందరికీ ఇదే నా సవాల్. 225 మంది ఎమ్మెల్యేల ప్రైవేట్ లైఫ్ మీద దర్యాప్తు చేయిద్దాం. ఎవరికి అక్రమ సంబంధాలున్నాయో, ఎవరెవరితో సంబంధాలున్నాయో తేలుద్దాం. ఇది నీతికి, నిజాయతీకి సంబంధించిన విషయం’’ అని అన్నారు.
ప్రతిపక్ష కాంగ్రెస్ నేత సిద్దరామయ్య, మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమార స్వామి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్, కాంగ్రెస్ ఎమ్మెల్యే మునియప్పల పేర్లను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించి సవాల్ విసిరారు. ‘‘అందరూ సత్యహరిశ్చంద్రులే కదా.. ఏకపత్నీవ్రతులే కదా.. వారి ప్రైవేట్ లైఫేంటో తేలుద్దాం మరి’’ అని అన్నారు.
అయితే, ఆయన వ్యాఖ్యలపై కల్పించుకున్న స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కగేరి.. అసెంబ్లీ ఎవరూ ఎవరి గురించి అలాంటి మాటలు మాట్లాడడం తగదని అన్నారు. సుధాకర్ వ్యాఖ్యలు ఎమ్మెల్యేల గౌరవానికి భంగం కలిగించేవని సిద్దరామయ్య విమర్శించారు. ప్రజా జీవితంలో అసలు గౌరవం ఉందా? అంటూ సుధాకర్ పై కుమార స్వామి మండిపడ్డారు. ‘‘ఇలాంటి పరిస్థితి నువ్వు కోర్టుకు వెళ్లడం వల్లే వచ్చింది’’ అంటూ విరుచుకుపడ్డారు.
స్పీకర్, ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవడంతో సుధాకర్ వెనక్కు తగ్గారు. సభ్యులందరి పట్లా తనకు గౌరవం ఉందని, ప్రతిపక్షాల అర్థంపర్థంలేని వ్యాఖ్యలతో అసహనానికి గురై ఇలాంటి వ్యాఖ్యలు చేశానని, తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరారు.