Mukesh Ambani: భారత్ ఆర్థికంగా దూసుకెళుతోంది.. ఔత్సాహికులకు అపార అవకాశాలున్నాయన్న ముకేశ్ అంబానీ
- డిజిటల్, టెక్నాలజీ రంగాల్లోనూ రాణిస్తోంది
- ఔత్సాహిక పారిశ్రామికవేత్తలే భారత్‌కు చోదకశక్తి
- ప్రైవేటీకరణ, సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులతో అపారమైన అవకాశాలు
- ‘ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ ఇండియా 2020’ కార్యక్రమంలో అంబానీ
భారత్ ఆర్థికంగా దూసుకెళుతోందని ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ తెలిపారు. ప్రజాస్వామ్యంగా, దౌత్యపరంగా, సాంస్కృతికంగానూ వేగంగా పురోగతి సాధిస్తోందని పేర్కొన్నారు. డిజిటల్, టెక్నాలజీ రంగాల్లోనూ రాణిస్తోందని తెలిపారు. రానున్న కొన్ని దశాబ్దాల్లో ప్రపంచంలోనే తొలి మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లోకి చేరే సత్తా భారత్‌కు ఉందని అభిప్రాయపడ్డారు. గురువారం జరిగిన ‘ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ ఇండియా 2020’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్‌తో పాటు ప్రపంచాన్ని మార్చే దిశగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు చేస్తున్న కృషే భారత్‌కు చోదకశక్తి అని అంబానీ వ్యాఖ్యానించారు. భారత్‌లో ఔత్సాహికులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రైవేటీకరణ దిశగా తీసుకుంటున్న చర్యలతో పాటు సాంకేతిక రంగంలో వస్తున్న వేగవంతమైన మార్పులే తన విశ్వాసానికి కారణమని తెలిపారు. విద్య, వైద్యం, స్వచ్ఛ ఇంధనం, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, వ్యవసాయం, పారిశ్రామికం, సేవా రంగాల్లో వస్తున్న మార్పులు అపార అవకాశాలను తెచ్చిపెట్టనున్నాయన్నారు. పైగా భారత్‌లోని ఔత్సాహికులు ప్రపంచ ప్రమాణాలకు దీటుగా ఉత్పత్తులను ఆవిష్కరిస్తున్నారని తెలిపారు.