Mamata Banerjee: ఐదేళ్లలో దాదాపు సగం తగ్గిన మమతా బెనర్జీ ఆస్తులు!
- తాజాగా ఆస్తి విలువ రూ. 16.72 లక్షలు మాత్రమే
- 2016లో రూ.30 లక్షలకు పైగా ఆస్తులు
- వివరాలను ఈసీకి వెల్లడించిన మమత
ఐదు సంవత్సరాల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల వేళ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించిన ఆస్తుల విలువతో పోలిస్తే, ఇప్పుడామె ఆస్తుల విలువ దాదాపు సగానికి తగ్గింది. తాజాగా, ఎన్నికల నిబంధనల మేరకు ఈసీకి మమతా బెనర్జీ, తన పేరిట ఉన్న స్థిర, చరాస్తుల గురించిన వివరాలు ఇచ్చారు. 2016లో ఆమె భవానీపూర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన వేళ, తన ఆస్తుల విలువ రూ. 30,45,013గా ఆమె డిక్లరేషన్ ఇచ్చారు.
ఇక తాజా ఎన్నికలకు సంబంధించి మమతా బెనర్జీ డిక్లరేషన్ ఇస్తూ, తన ఆస్తుల విలువ రూ. 16,72,352 అని పేర్కొన్నారు. ఇక టీఎంసీకే చెందిన మమతా భూనియా, సుకుమార్ డే తదితరులు తమ సంపద 37 శాతం వరకూ తగ్గిందని తెలిపారు. ఇదే సమయంలో సీపీఎంకు చెందిన పన్సుకురా పుర్బా అభ్యర్థి షేక్ ఇబ్రహీమ్ మాత్రం 2016తో పోలిస్తే ఆస్తుల విలువను ఏకంగా 2,141 శాతం పెంచుకోవడం గమనార్హం.