Alla Ramakrishna Reddy: భూములు ఇవ్వకపోతే ప్రభుత్వం లాగేసుకుంటుందని రైతులను బెదిరించారు: ఆళ్ల రామకృష్ణారెడ్డి
- అసైన్డ్ భూముల అంశంలో సీఐడీకి ఫిర్యాదు చేసిన ఆళ్ల
- ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని పునరుద్ఘాటన
- భూములు చౌకగా కొట్టేశారని ఆరోపణ
- ఓ వర్గం మీడియా అసత్య ప్రచారం చేస్తోందని విమర్శ
- విచారణలో అన్నీ బయటికొస్తాయని స్పష్టీకరణ
అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని సీఐడీకి ఫిర్యాదు చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తన అభిప్రాయాలను వెల్లడించారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, పక్కా ప్లాన్ ప్రకారమే దోపిడీ చేశారని పునరుద్ఘాటించారు. భూములు ఇవ్వకపోతే ప్రభుత్వం లాగేసుకుంటుందని నాడు రైతులను బెదిరించారని ఆరోపించారు. బాబు, ఆయన బినామీలు రైతులను బెదిరించి చౌకగా భూములు కొన్నారని వెల్లడించారు.
ఆఖరికి లంక భూములను సైతం కాజేశారని, అప్పటి అధికారులపై ఒత్తిడి తెచ్చి భూముల రిజిస్ట్రేషన్ చేయించారని వివరించారు. రైతుల స్టేట్ మెంట్లను సీఐడీ అధికారులు ఇప్పటికే రికార్డు చేశారని వెల్లడించారు. అమరావతి భూములపై ఓ వర్గం మీడియా అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. అయితే సీఐడీ విచారణలో వాస్తవాలన్నీ బయటికి వస్తాయని అన్నారు.