Brazil: బ్రెజిల్లో ఒక్కరోజే లక్ష కరోనా కేసులు
- రికార్డు స్థాయిలో నమోదవుతున్న రోజువారీ కేసులు
- గురువారం ఒక్క రోజే 1,00,158 కేసులు
- 24 గంటల వ్యవధిలో 2,777 మరణాలు
- ఇప్పటి వరకు దేశంలో 3 లక్షల మరణాలు
బ్రెజిల్లో కరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గురువారం ఒక్క రోజే 1,00,158 కేసులు వెలుగు చూసినట్టు బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. అలాగే 2,777 మరణాలు కూడా సంభవించాయని పేర్కొంది. మంగళవారం రికార్డు స్థాయిలో 3,251 మంది మృత్యువాత పడ్డారు. దీంతో అక్కడి కరోనా మరణాల సంఖ్య 3 లక్షల మార్కును దాటేసింది.
గత 75 రోజుల్లోనే లక్ష మంది కరోనా మహమ్మారితో మరణించినట్లు ఆ దేశ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. తాజా వివరాల ప్రకారం బ్రెజిల్లో ఇప్పటివరకు 1,23,24,769 మంది కొవిడ్ బారిన పడ్డారు. వీరిలో 1,07,72,549 మంది కోలుకున్నారు. 3,03,726 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులు భారీగా విజృంభిస్తుండడంతో ఆ దేశ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.