Maharashtra: ఈ నెల 28 నుంచి మహారాష్ట్రలో రాత్రిపూట కర్ఫ్యూ

Maharashtra to Impose Night Curfew from March 28

  • కరోనా విజృంభణ నేపథ్యంలో సీఎం కీలక నిర్ణయం
  • ఉన్నతాధికారులతో సమీక్ష
  • నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం
  • లాక్‌డౌన్‌ విధించడం తనకు ఇష్టం లేదన్న సీఎం  

మహారాష్ట్రలో కరోనా వైరస్‌ భారీగా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత కఠిన చర్యల దిశగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని సీఎం ఉద్ధవ్‌ థాకరే నిర్ణయించారు. గత కొన్ని వారాలుగా కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఈ నెల 28 నుంచి కర్ఫ్యూ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో కరోనా పరిస్థితి, కట్టడి చర్యలపై డివిజనల్‌ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎస్పీలతో పాటు వైద్యాధికారులతో సీఎం శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. లాక్‌డౌన్‌ విధించడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. అయితే, కరోనా రోగుల సంఖ్య పెరుగుతున్నకొద్దీ ఆరోగ్య సంరక్షణ వసతులు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా రోగులకు అవసరమైన పడకలు, మందులను అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
 
ప్రజలంతా కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఉద్ధవ్‌ ఆదేశించారు. రాత్రిపూట కర్ఫ్యూకి సంబంధించిన ఉత్తర్వులను విపత్తు నిర్వహణ శాఖ త్వరలోనే విడుదల చేస్తుందని సీఎం కార్యాలయం వెల్లడించింది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు మాల్స్‌ మూసివేయాలని ఆదేశించింది.

  • Loading...

More Telugu News