Team India: రెండో వన్డేలో టీమిండియా ఓటమి... 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలుపు
- భారీ స్కోర్ల మ్యాచ్ లో ఇంగ్లండ్ దే పైచేయి
- తొలుత 6 వికెట్లకు 336 పరుగులు చేసిన భారత్
- 43.3 ఓవర్లలోనే ఛేదించిన ఇంగ్లండ్
- బెయిర్ స్టో సెంచరీ, స్టోక్స్ 99 రన్స్
- ఒత్తిడిని అధిగమించి విజయాన్నందుకున్న మోర్గాన్ సేన
ఆసక్తికరంగా సాగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ విజయంతో మురిసింది. పూణే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో మొదట భారత్ 6 వికెట్లకు 336 పరుగులు చేయగా, కొన్ని ఉత్కంఠభరిత పరిస్థితులను అధిగమించిన ఇంగ్లండ్ 43.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి గెలుపు తీరాలకు చేరింది. చివర్లో డేవిడ్ మలాన్ విన్నింగ్ షాట్ తో ఇంగ్లండ్ శిబిరంలో ఆనందం నింపాడు.
అంతకుముందు, జానీ బెయిర్ స్టో (112 బంతుల్లో 124; 11 ఫోర్లు, 7 సిక్సులు), బెన్ స్టోక్స్ (52 బంతుల్లో 99; 4 ఫోర్లు, 10 సిక్సులు) విధ్వంసం సృష్టించారు. ఈ జోడీ భాగస్వామ్యమే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో కీలకంగా నిలిచింది. ఓ దశలో వెంటవెంటనే మూడు వికెట్లు పడడంతో ఇంగ్లండ్ స్కోరు నిదానించినా, డేవిడ్ మలాన్ (16 నాటౌట్), లియామ్ లివింగ్ స్టన్ (27 నాటౌట్) భారత్ కు మరో అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ ను ముగించారు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 2, భువనేశ్వర్ కుమార్ ఓ వికెట్ తీశారు.
ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను మోర్గాన్ సేన 1-1తో సమం చేసింది. ఇరుజట్ల మధ్య చివరిదైన మూడో వన్డే పూణేలోనే మార్చి 28న జరగనుంది.