Devineni Uma: అక్కడ ఎకరం అమ్మి ఏపీలో రెండెకరాలు కొంటున్నారని పక్కరాష్ట్ర సీఎం చెప్పిన మాటలు వినపడుతున్నాయా?: సీఎం జగన్ పై ఉమ వ్యాఖ్యలు
- తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు
- రియల్ ఎస్టేట్ పడిపోతుందని నాడు శాపాలు పెట్టారని వెల్లడి
- ఆ శాపాలు వాళ్లకే రివర్స్ అయ్యాయని వివరణ
- కేసీఆర్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ దేవినేని ఉమ విమర్శలు
ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఏపీ పేరు ప్రస్తావించారు. గతంలో రాష్ట్ర విభజన సమయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోతుందని చాలామంది శాపాలు పెట్టారని, ఇప్పుడా శాపాలు వాళ్లకే రివర్స్ అయ్యాయని అన్నారు. ఇవాళ తెలంగాణలో ఎకరం భూమి రూ.30 లక్షలకు అమ్మి, ఏపీలో ఎకరం పదిహేను లక్షల రూపాయల చొప్పున కొంటున్నారని వివరించారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ నేత దేవినేని ఉమ సీఎం జగన్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు.
"రావాలి కావాలి అని ఊదరగొట్టారు. వచ్చాక ఏంచేశారో, రాష్ట్రాన్ని ఏ స్థితికి తీసుకెళ్లారో" అంటూ వ్యాఖ్యానించారు. అక్కడ ఎకరం అమ్మి ఏపీలో రెండెకరాలు కొంటున్నారని మీ రివర్స్ పాలనపై పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి శాసనసభలో చెప్పిన మాటలు వినపడుతున్నాయా? అంటూ ప్రశ్నించారు. దేశం మొత్తం మనవైపు చూసేలా చేయడం అంటే ఇదేనా? అని వ్యంగ్యంగా అన్నారు.