Buggana Rajendranath: అందుకే ఏపీలో ఆర్డినెన్స్ రూపంలో బడ్జెట్: మంత్రి బుగ్గన
- యనమల విమర్శలు అర్థరహితం
- రాజ్యాంగంలో ఓటాన్ అకౌంట్ ఒక ప్రొవిజన్
- ఉద్యోగుల జీతభత్యాలు, అత్యవసరాల కోసం అమలు
- రాజకీయ దురుద్దేశంతో విమర్శలు
ఏపీ సర్కారు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్ ప్రవేశపెట్టే దుష్ట సంప్రదాయానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెరలేపారంటూ టీడీపీ నేత యనమల రామకృష్ణుడు చేసిన విమర్శలపై రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు.
కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం యాగంటి క్షేత్రంలో ఆయన మాట్లాడుతూ.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై యనమల రామకృష్ణుడు చేసిన విమర్శలు అర్థరహితమని చెప్పారు. రాజ్యాంగంలో ఓటాన్ అకౌంట్ ఒక ప్రొవిజన్ అని చెప్పారు. బడ్జెట్‌ను అమలు చేయలేని సమయంలో ఉద్యోగుల జీతభత్యాలు, అత్యవసరాల కోసం ఓటాన్ అకౌంట్‌ను అమలు చేయవచ్చని, ఈ విషయం యనమలకు కూడా తెలుసని తెలిపారు.
అయినప్పటికీ ఆయన రాజకీయ దురుద్దేశంతో విమర్శలు చేస్తున్నారని బుగ్గన చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి స్పష్టత రాకపోవడంతో పాటు కరోనా విజృంభణ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరిపే అవకాశం లేకపోవడంతోనే తాము ఓటాన్ అకౌంట్‌ను అమలు చేస్తున్నట్లు వివరించారు. కాగా, మొత్తం రూ.90 వేల కోట్లతో బడ్జెట్ ఆర్డినెన్స్‌కు నిన్న కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.