Smriti Irani: కోయంబత్తూర్ బీజేపీ అభ్యర్థితో చర్చకు రావాలని కమలహాసన్‌కు స్మృతి ఇరానీ సవాల్!
- తమిళనాడులో వేడెక్కిన రాజకీయాలు
- కోయంబత్తూర్ నుంచి పోటీచేస్తున్న కమల్
- ప్రచారంలో కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుంటున్న వైనం
- సమస్యలపై ఎవరికి పట్టుందో తేల్చుకునేందుకు చర్చకు రావాలని సవాల్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పరస్పరం సవాళ్లు ప్రతిసవాళ్లతో రాజకీయం జోరెక్కింది. కోయంబత్తూర్ బరిలో నిలిచిన నటుడు, మక్కల్ నీది మయ్యం వ్యవస్ధాపకుడు కమల్ హాసన్‌కు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తాజాగా సవాల్ విసిరారు.
కోయంబత్తూర్‌లో తమ పార్టీ అభ్యర్ధి వనతి శ్రీనివాసన్‌తో చర్చకు రావాలని కమలహాసన్‌కు ఆమె సవాల్ చేశారు. కమల్ తన ప్రచారంలో అభివృద్ధి పనులపై కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుంటున్న నేపథ్యంలో స్మృతి ఇరానీ బీజేపీ అభ్యర్ధితో చర్చకు రావాలని కోరారు.
కోయంబత్తూర్‌లో నిర్వహించిన గుజరాతీ సమాజ్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ కొన్నేళ్ల కిందట కమలహాసన్‌తో తాను ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నానని గుర్తుచేశారు. అంశాలపై పట్టు ఉండి సమస్యల పరిష్కారంలో ఎవరు చురుకుగా వ్యవహరిస్తారో నిరూపించేందుకు వనతి శ్రీనివాసన్‌తో చర్చకు రావాలని తాను కమలహాసన్‌ను సవాల్ చేస్తున్నానని ఆమె పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పది కోట్ల మరుగుదొడ్లను నిర్మిస్తే తమిళనాడులోనే 90 లక్షల టాయ్లెట్లు అందుబాటులోకి వచ్చాయని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు.