Robert Redfiled: కరోనా చైనా ల్యాబ్ నుంచే తప్పించుకుని ఉంటుంది: అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ మాజీ డైరెక్టర్ వెల్లడి
- ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్
- వుహాన్ నుంచే వచ్చి ఉంటుందని అనుమానాలు
- కాదని తేల్చిన డబ్ల్యూహెచ్ఓ
- అయినప్పటికీ సందేహాలు లేవనెత్తుతున్న అమెరికా నిపుణులు
చైనాలోని వుహాన్ లేబరేటరీ నుంచి కరోనా వైరస్ లీకవలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్ధారించినప్పటికీ అమెరికా నిపుణులు మాత్రం ఇప్పటికీ సందేహాలు వ్యక్తపరుస్తూనే ఉన్నారు. చైనాలోని ఓ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ తప్పించుకుని ఉంటుందని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ మరియు నివారణ సంస్థ (సీడీసీ) మాజీ డైరెక్టర్ రాబర్ట్ రెడ్ ఫీల్డ్ పేర్కొన్నారు.
తన అంచనా ప్రకారం చైనాలోని వుహాన్ లో కరోనా వ్యాప్తి సెప్టెంబరు కానీ, అక్టోబరులో కానీ ప్రారంభమై ఉంటుందని అన్నారు. అయితే ఇది తన అభిప్రాయం మాత్రమేనని, ఈ క్రిములు వుహాన్ లోని ఓ ల్యాబ్ నుంచి బయటికి వచ్చేందుకు అధిక అవకాశాలున్నాయని ఇప్పటికీ భావిస్తుంటానని తెలిపారు. ఇతరులు దీన్ని అంగీకరించకపోవచ్చని, కానీ సైన్స్ ఏదో ఒకనాడు దీని నిగ్గు తేల్చుతుందని రెడ్ ఫీల్డ్ వ్యాఖ్యానించారు.
తాను ఓ వైరాలజిస్టునని, వైరస్ లపై అధ్యయనంలో చాలాకాలం గడిపానని వివరించారు. ఆ అనుభవంతోటే చెబుతున్నానని... ఓ గబ్బిలం నుంచి మానవుడికి కరోనా వైరస్ వ్యాప్తి చెందిందంటే తాను నమ్మబోనని స్పష్టం చేశారు. జంతువుల నుంచి మానవుడికి సంక్రమించిన వైరస్ తదనంతరం మానవుడి నుంచి మానవుడికి వ్యాప్తి చెందడానికి చాలా సమయం తీసుకుంటుందని, కానీ ఇది అలా లేదని రెడ్ ఫీల్డ్ అభిప్రాయపడ్డారు.