Suez Canal: ఎవర్ గ్రీన్ కదిలింది.. ఆశ రేకెత్తించింది!
- 29 మీటర్లు పక్కకు జరిగిందంటున్న అధికారులు
- ప్రొపెల్లర్, రడ్డర్ లను బురద నుంచి బయటకు తీసిన సిబ్బంది
- షిప్పు కింది నుంచి ప్రయత్నాలు చేస్తున్నారన్న సూయజ్ కాల్వ చీఫ్
- మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని కామెంట్
సూయజ్ కాల్వలో ఆరు రోజులుగా ఇరుక్కుపోయిన ఎవర్ గ్రీన్ ఎట్టకేలకు కదిలింది. ఇన్ని రోజులుగా టగ్ బోట్లు, డ్రెడ్జర్లతో సూయజ్ పోర్టు అధికారులు ప్రయత్నిస్తుండడంతో అది 29 మీటర్లు పక్కకు కదిలింది. మంగళవారం ఎవర్ గ్రీన్ నౌక అక్కడ అడ్డంగా ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే. శనివారం అర్ధరాత్రి వరకు ప్రయత్నాలు కొనసాగించిన అధికారులు.. ఒడ్డున ఉన్న మట్టిని, ఇసుకను తవ్వుతూ ఎవర్ గ్రీన్ కు లైన్ ను క్లియర్ చేసేందుకు శ్రమిస్తున్నారు.
వాటికి తోడు గాలులు పెరగడం, అలల తీవ్రత ఎక్కువకావడం వంటి కారణాలతో ఎవర్ గ్రీన్ షిప్పు పక్కకు జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే నౌక ప్రొపెల్లర్, రడ్డర్లను బురద నుంచి తొలగించినట్టు చెప్పారు. కాగా, మానవ తప్పిదం వల్లే ఎవర్ గ్రీన్ నౌక ఇలా ఒడ్డుకు వచ్చి ఆగిపోయి ఉంటుందని సూయజ్ కాల్వ చైర్మన్ జనరల్ ఒసామా రబీ అన్నారు.
వాతావరణ పరిస్థితులొక్కటే షిప్పు ఒడ్డుకొచ్చి నిలిచిపోవడానికి కారణాలు కాదన్నారు. దానికి సాంకేతిక కారణాలు లేదా మానవ తప్పిదాల వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చన్నారు. ప్రస్తుతం సిబ్బంది నౌక కిందకు వెళ్లి మరీ దానిని పక్కకు తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. తొందరగానే షిప్పును పక్కకు తొలగిస్తామని చెప్పారు. కాగా, శనివారం అర్ధరాత్రి నాటికి అక్కడ 326 నౌకలు జామ్ అయినట్టు అధికారులు చెప్పారు.