Nadendla Manohar: అప్పుల్లో ఏపీని దేశంలోనే తొలి స్థానంలో నిలబెట్టారు: నాదెండ్ల మనోహర్ విమర్శలు
- వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసింది
- మా కార్యకర్తలపై వైసీపీ దాడులు చేస్తోంది
- సంస్థాగతంగా జనసేన మరింత బలోపేతం కావాలి
ఆంధ్రప్రదేశ్ ను వైసీపీ ప్రభుత్వం అప్పుల్లో ముంచేసిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు. అప్పుల్లో ఏపీని దేశంలోనే తొలి స్థానంలో నిలబెట్టారని అన్నారు. మద్యం, ఇసుక, సిమెంట్ ద్వారా వస్తున్న డబ్బంతా ఎక్కడకు వెళ్తోందని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో 96 శాతాన్ని గెలిచామని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారని... పోలీస్, వాలంటీర్ వ్యవస్థలను వాడుకోకుండా ఉంటే వైసీపీకి ఈ గెలుపు సాధ్యమయ్యేదా? అని ప్రశ్నించారు.
ఒక సామాజికవర్గాన్ని టార్గెట్ చేసి, తమ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయని మనోహర్ దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. తిరుపతి ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తుండటంపై కొందరు జన సైనికులు ఆవేదన చెందుతున్న మాట నిజమేనని చెప్పారు. అయితే, ఇతర పార్టీల అభ్యర్థుల కంటే తమ ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ మెరుగైన అభ్యర్థి అని అన్నారు. ఆమె విజయం కోసం జనసైనికులంతా పని చేయాలని పిలుపునిచ్చారు.
కాబోయే సీఎం పవన్ కల్యాణ్ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పడం... జనసేనకు ఉన్న బలమని మనోహర్ అన్నారు. సంస్థాగతంగా జనసేన మరింత బలోపేతం కావాలని చెప్పారు. కరోనా సమయంలో కూడా జనసేనకు లక్ష క్రియాశీలక సభ్యత్వాలు రావడం గొప్ప విషయమని అన్నారు. ప్రతి క్రియాశీలక సభ్యుడికి రూ. 5 లక్షల బీమా చేయిస్తున్నామని చెప్పారు.