Vellampalli Srinivasa Rao: జగన్ ప్రభుత్వంపై కొందరు స్వామీజీల వైఖరి బాధాకరం: మంత్రి వెల్లంపల్లి
- విజయవాడలో హిందూ ఆచార్య సభ ఆధ్వర్యంలో సమావేశం
- హాజరైన మంత్రి వెల్లంపల్లి
- ఏపీలో ఆలయాలపై దాడుల ప్రస్తావన
- స్వామీజీలు ఉపేక్షిస్తున్నారని వ్యాఖ్యలు
- జగన్ సర్కారును అస్థిరపరిచేందుకు కుట్ర అని ఆరోపణ
వైసీపీ ప్రభుత్వం ఏ ఒక్క మతానికి కొమ్ము కాయదని, అన్ని మతాలను సమానంగా చూస్తుందని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. అయితే తమ ప్రభుత్వంపై కొందరు స్వామీజీల వైఖరి విచారకరమని అన్నారు. రాష్ట్రంలోని దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్నవారి పట్ల స్వామీజీలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. దేవాలయాలపై దాడులు, మత రాజకీయాలతో జగన్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
దేవాలయాలపై దాడులకు సంబంధించి 300 మందిని అరెస్ట్ చేశారని, దేవాలయాల రక్షణ బాధ్యత ప్రభుత్వానికే కాకుండా ప్రజలకు కూడా ఉంటుందని మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యానించారు. విజయవాడలో హిందూ ఆచార్య సభ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.