Anil Kumar Yadav: తిరుపతిలో ఐదు లక్షల మెజారిటీతో గెలిచి సీఎం జగన్ కి కానుకగా ఇస్తాం: మంత్రి అనిల్ కుమార్
- ఏప్రిల్ 17న తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్
- నేడు నామినేషన్ వేసిన వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి
- ఈ కార్యక్రమలంలో పాల్గొన్న ఏపీ మంత్రులు
- ప్రజలు వేలాదిగా తరలివచ్చారన్న అనిల్
- దేశం మొత్తం తిరుపతి వైపు చూడడం ఖాయమన్న పెద్దిరెడ్డి
తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక బరిలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ గురుమూర్తి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుపతి లోక్ సభ స్థానాన్ని 5 లక్షల ఓట్ల మెజారిటీతో కైవసం చేసుకుని సీఎం జగన్ కు కానుకగా ఇస్తామని తెలిపారు.
నామినేషన్ సందర్భంగా ఎలాంటి ఆడంబరాలకు పోకూడదని తాము అనుకున్నామని, కానీ ప్రజలు వేలాదిగా స్వచ్ఛందంగా తరలి వచ్చారని వెల్లడించారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ప్రజల్లో ఉన్న స్పందన చూస్తుంటే వారిలో సీఎం జగన్ పై నమ్మకం ఉట్టిపడుతోందని అన్నారు. తిరుపతి బరిలో టీడీపీ ఎప్పుడో చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, సీఎం జగన్ పథకాలతో పూర్తి సంతృప్తితో ఉన్న తిరుపతి ప్రజలు ఉప ఎన్నికలో డాక్టర్ గురుమూర్తికి ఓటేసి రుణం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఓ సామాన్య దళితుడైన డాక్టర్ గురుమూర్తికి సీఎం జగన్ అవకాశమిస్తే, ఇద్దరు కేంద్ర మాజీ మంత్రులకు, ఓ మాజీ సీఎస్ కు ప్రతిపక్షాలు అవకాశం ఇచ్చాయని పెద్దిరెడ్డి వివరించారు. తిరుపతి ఉప ఎన్నిక ద్వారా దేశం మొత్తం ఇటువైపు చూడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కాగా, తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నిక కోసం టీడీపీ తరఫున కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ తరఫున చింతా మోహన్ బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ పోటీ చేస్తున్నారు. ఈ ఉప ఎన్నిక పోలింగ్ ఏప్రిల్ 17న జరగనుంది.