Sanjay Raut: వాజే ఉదంతం మా సంకీర్ణ ప్రభుత్వానికి ఒక గుణపాఠం: సంజయ్ రౌత్
- నేను దశాబ్దాల పాటు జర్నలిస్టుగా పని చేశాను
- వాజే గురించి నాకు పూర్తిగా తెలుసు
- వాజేను మళ్లీ తీసుకుంటే ప్రభుత్వానికి ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించాను
సచిన్ వాజే ఉదంతం మహారాష్ట్రలోని తమ సంకీర్ణ ప్రభుత్వానికి మంచి గుణపాఠం నేర్పిందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. వాజే వల్ల సంకీర్ణ ప్రభుత్వానికి సమస్యలు ఎదురవుతాయని తాను ఎప్పుడో హెచ్చరించానని చెప్పారు. ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలు ఉన్న వాహనం కేసులో వాజే అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు.
వాజేను మళ్లీ పోలీసు శాఖలోకి తీసుకోవాలని ప్రభుత్వం అనుకున్నప్పుడే... ఆయన గురించి తమ పార్టీలోని కొందరికి తాను సమాచారం ఇచ్చానని సంజయ్ రౌత్ తెలిపారు. కొన్ని దశాబ్దాల పాటు తాను జర్నలిస్టుగా పని చేశానని... వాజే గురించి తనకు పూర్తిగా తెలుసని చెప్పారు. స్వతహాగా ఆయన చెడ్డవాడు కానప్పటికీ... కొన్ని పరిస్థితుల్లో ఆయన ప్రవర్తన, పనితీరు విరుద్ధంగా ఉంటుందని అన్నారు. వాజే వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉందని తాను హెచ్చరించానని చెప్పారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రహస్యంగా భేటీ అయ్యారనే వార్తలపై సంజయ్ రౌత్ స్పందిస్తూ, ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదని అన్నారు. ప్రత్యర్థి పార్టీల నేతల మధ్య చర్చలు జరగడం మంచిదేనని చెప్పారు. వారి భేటీ గురించి ఎక్కువ ఆలోచించవద్దని అన్నారు.