Rishikesh: రిషికేశ్‌లోని హోటల్లో 76 మందికి కరోనా పాజిటివ్
- తొలుత 16 మంది సిబ్బందికి సోకిన వైరస్
- తాజాగా వెలుగులోకి మరికొన్ని కేసులు
- మూడు రోజుల పాటు హోటల్ మూసివేత
- కుంభమేళా నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. రోజురోజుకీ కొత్త కేసుల సంఖ్య భారీ స్థాయిలో పెరుగుతోంది. తగ్గినట్టే కనిపించిన మహమ్మారి మళ్లీ మొదలై ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఉత్తరాఖండ్ రిషికేశ్‌లోని తాజ్ హోటల్లో కరోనా కలకలం సృష్టించింది. ఏకంగా 76 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.
దీంతో ఆ హోటల్‌ను మూడు రోజుల పాటు పూర్తిగా మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. హోటల్‌ను పూర్తిగా శానిటైజ్ చేశారు. గత గురువారం హోటల్లో 16 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన యాజమాన్యం అందరికీ నిర్ధారణ పరీక్షలు చేయించింది. దీంతో తాజా కేసులు వెలుగులోకి వచ్చాయి.
కుంభమేళాకు సిద్ధమవుతున్న వేళ కరోనా కేసులు భారీగా వెలుగుచూస్తుండడంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కఠిన ఆంక్షలను అమలు చేయాలని యోచిస్తోంది.
కుంభమేళాకు తరలివచ్చే భక్తులకు ప్రభుత్వం కొవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి చేసింది. లేదంటే వ్యాక్సినేషన్ ధ్రువీకరణ పత్రమైనా ఉండాలని తెలిపింది. కుంభమేళా ఏప్రిల్ 1న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.