Swami Swaroopanandendra: 25 బస్సుల్లో 1200 మంది దళిత గిరిజనులు... విశాఖ శారదా పీఠం ఆధ్వర్యంలో తిరుమల యాత్ర ప్రారంభం!
- బస్సులకు జెండా ఊపి ప్రారంభించిన స్వరూపానంద
- అరకు, పాడేరు ప్రాంతాల నుంచి దళితులతో యాత్ర
- హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా యాత్ర
- దేనికీ పనికిరానివాళ్లు తమపై వ్యాఖ్యలు చేస్తున్నారన్న స్వామీజీ
అరకు, పాడేరు ప్రాంతాలకు చెందిన 1,200 మంది దళిత గిరిజనులను తిరుమల యాత్రకు పంపుతున్నామని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి వెల్లడించారు. ఆయన ఇవాళ దళిత గిరిజనులను 25 బస్సుల్లో తిరుమల పంపే యాత్రకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తదుపరి విశాఖ పీఠాధిపతి స్వాత్మానంద సరస్వతి కూడా పాల్గొన్నారు.
ఈ యాత్రపై స్వరూపానంద మీడియాతో మాట్లాడారు. ధర్మ పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని, హిందూ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా దళిత గిరిజనులను తిరుమల పంపుతున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన పలు రాజకీయపరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. అన్యమత ప్రచారాన్ని అడ్డుకునేలా జీవో తీసుకురావడంలో తమ పీఠం కృషి చేసిందని, దేవాలయ భూములు ఇతరుల పరం కాకుండా కాపాడడంలోనూ తమ పాత్ర ఉందని అన్నారు. అయితే, దేవాలయాల్లో దాడులు జరుగుతుంటే విశాఖ శారదాపీఠం స్పందించడంలేదని కొందరు పనికిరాని నేతలు విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. దేవాదాయ శాఖలో జరుగుతున్న అవినీతిని ప్రభుత్వాలకు తెలియజేస్తామని స్పష్టం చేశారు.