Stock Market: భారీ లాభాల్లో మార్కెట్... 800 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్!
- 837 పాయింట్లు పెరిగిన బీఎస్ఈ సూచిక
- క్రితం ముగింపుతో పోలిస్తే సెషన్ ఆరంభంలోనే ఒక శాతం లాభం
- ఉత్సాహంగా జరుగుతున్న ఈక్విటీల కొనుగోళ్లు
మూడు రోజుల సుదీర్ఘ వారాంతం అనంతరం, ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే లాభాల్లోకి దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్ సూచీలు, అదే ట్రెండ్ ను కొనసాగిస్తున్నాయి. ఈ ఉదయం 11.35 గంటల సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్, 837 పాయింట్లు పెరిగి 1.71 శాతం లాభంతో 49,845 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ, 263 పాయింట్లు పెరిగి 1.81 శాతం లాభంతో 14,770 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి.
సెన్సెక్స్ లోని అన్ని సెక్టోరల్ ఇండెక్స్ లూ లాభాల్లో నడుస్తుండగా, మెటల్ కంపెనీలు అధిక లాభాలను పండించుకుంటున్నాయి. సెన్సెక్స్ 30లో ఎంఅండ్ఎం, భారతీ ఎయిర్ టెల్, మారుతి సుజుకి కంపెనీలు మాత్రమే నష్టాల్లో ఉండగా, మిగతా అన్ని కంపెనీలూ అర శాతం నుంచి నాలుగు శాతం వరకూ లాభపడ్డాయి.
ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉండటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడిందని, సంస్థాగత ఇన్వెస్టర్లు, దేశవాళీ ఫండ్ సంస్థలు నూతన ఈక్విటీల కొనుగోలుకు ఆసక్తిని చూపుతున్నారని మార్కెట్ నిపుణులు విశ్లేషించారు. ఆసియా మార్కెట్లలో నిక్కీ 0.16 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 0.71 శాతం, హాంగ్ సెంగ్ ఒక శాతం, తైవాన్ వెయిటెన్డ్ 0.48 శాతం, కోస్పి 1.03 శాతం, సెట్ కాంపోజిట్ 0.56 శాతం, షాంగై కాంపోజిట్ 0.37 శాతం పెరిగాయి. ఒక్క జకార్తా కాంపోజిట్ మాత్రం ఒక శాతం నష్టాన్ని నమోదు చేసింది.