swiggy: 3 వేల ఏళ్ల క్రితమే ఫుడ్ హోం డెలివరీ.. పరిశోధనలో వెల్లడి
- కాంస్య యుగంలోనే ఆహారాన్ని తెప్పించుకుని తినే అలవాటు
- ఆస్ట్రియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధకుల గుర్తింపు
- ఆస్ట్రియాలోని ఆల్ప్స్ ప్రాంతంలో పరిశోధనలు
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకుని ఇంటికి తెప్పించుకుని తినే అలవాటు ప్రస్తుతం చాలా మందిలో పెరిగిపోయింది. స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలకు ఆర్డర్లు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అయితే, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇటువంటి హోం డెలివరీలు లేవని అనుకుంటే పొరపాటే. కాంస్య యుగంలోనే ఆహారాన్ని తెప్పించుకుని తినడం ప్రారంభమైందని ఆస్ట్రియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు చెబుతున్నారు.
వారు ఆస్ట్రియాలోని ఆల్ప్స్ ప్రాంతంలో కాంస్య యుగం నాటి ఓ రాగి గనిలో పరిశోధనలు చేశారు. ఆ గనిలో రాగిని తీసేందుకు ఓ ప్రత్యేకమైన కమ్యూనిటీ ఉండేది. అక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకుని పనులు చేసుకునేది. అక్కడే పరిశోధకులు చాలా కాలంగా పలు అంశాలపై పరిశోధనలు చేస్తున్నారు. అక్కడ జరిపిన తవ్వకాల్లో పలు వస్తువులు లభ్యమయ్యాయి.
అప్పటి వారు తిని వదలేసిన ఆహార పదార్థాల శిలాజాలు కూడా దొరకడంతో వాటిని పరిశీలించారు. అయితే, ఆ ప్రాంతంలో వంట వండటానికి సంబంధించిన వస్తువులు, ఏర్పాట్ల ఆనవాళ్లు లేవు. అక్కడ పనిచేసిన వారంతా ఇతర ప్రాంతాల నుంచే ఆహారాన్ని తెప్పించుకుని తినేవారని తేల్చారు. వారికి వంటలు వండి తీసుకొచ్చే పనులను ఇతర ప్రాంతంలో ఉండే వారు చేసే వారిని గుర్తించారు.