Narendra Modi: డీఎంకే కాలం చెల్లిన 2జీ మిస్సైల్ ను ప్రయోగించింది: మోదీ
- ఎ.రాజాను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు గుప్పించిన మోదీ
- మహిళలపై దాడి చేయాలని యూపీఏ మిస్సైల్ ను ప్రయోగించిందని వ్యాఖ్య
- యూపీఏ అధికారంలోకి వస్తే.. ఇతర మహిళలను కూడా దూషిస్తారన్న మోదీ
తమిళనాడులో ఏఐఏడీఎంకేతో కలిసి బీజేపీ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, సీఎం పళనిస్వామిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత ఎ.రాజాను ఉద్దేశించి పరోక్షంగా మోదీ విమర్శలు గుప్పించారు. డీఎంకే కాలం చెల్లిన 2జీ మిస్సైల్ ను ప్రయోగించిందని ఎద్దేవా చేశారు. ఈ మిస్సైల్ కు నిర్దిష్ట లక్ష్యం ఏమీ లేదని అన్నారు. రాష్ట్ర మహిళలను కించపరచడానికి కొన్ని రోజుల క్రితం ఈ మిస్సైల్ ను యూపీఏ లాంచ్ చేసిందని... మహిళలపై దాడి చేయాలనే ఆ మిస్సైల్ కు ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు.
ముఖ్యమంత్రి పళనిస్వామి తల్లిని ఉద్దేశించి కూడా డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు తీవ్ర వ్యాఖ్యలు చేశాయని మండిపడ్డారు. 'వాళ్లు అధికారంలోకి వస్తే... తమిళనాడులోని ఇతర మహిళలను కూడా దూషిస్తారు.. దేవుడా అలా జరగకుండా చూడు' అన్నారు.
స్టాలిన్ పుట్టుక సక్రమమైనదని... పళనిస్వామి పుట్టుక సరైనది కాదని ఎ.రాజా తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. స్టాలిన్ వేసుకునే చెప్పుల విలువ కూడా పళనిస్వామికి లేదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై పళనిస్వామి స్పందిస్తూ... ఎన్నికల ర్యాలీలో కంటతడి పెట్టారు. వాళ్లను దేవుడే శిక్షిస్తాడని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత పళనిస్వామికి రాజా క్షమాపణలు చెప్పినప్పటికీ... ఆయన వ్యాఖ్యలు రాజేసిన వేడి ఇంకా చల్లారలేదు. ఏప్రిల్ 6న తమిళనాడుకు ఎన్నికలు జరగనున్నాయి.