CPI Ramakrishna: సీపీఐ రామకృష్ణ మాటలకు స్పందించాల్సిన అవసరం లేదు: సోము వీర్రాజు
- మేము సవాల్ విసిరింది అధికార వైసీపీకి
- మీరు పొత్తు పెట్టుకోని పార్టీ ఏదైనా ఉందా?
- కాలానుగుణంగా మాట్లాడే వ్యక్తులతో చర్చ అవసరం లేదు
తిరుపతిని అభివృద్ది చేసింది కేంద్ర ప్రభుత్వమేనని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నేత రామకృష్ణ ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై చర్చకు సిద్ధమా? అని వీర్రాజుకు సవాల్ విసిరారు. రామకృష్ణ సవాల్ పై సోము వీర్రాజు ట్విట్టర్ వేదికగా స్పందించారు. తిరుపతి అభివృద్ధిపై తాము సవాల్ విసిరింది అధికార వైసీపీకి అని వీర్రాజు అన్నారు. తిరుపతిలో జరిగిన అభివృద్ధికి సంబంధించి తాము మూడు నెలలుగా ప్రజలకు వివరిస్తున్నామని చెప్పారు. రామకృష్ణగారి మాటలకు స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు.
దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలతో మీరు పొత్తు పెట్టుకుంటారని వీర్రాజు ఎద్దేవా చేశారు. ఒకసారి టీడీపీతో, ఒకసారి టీఆర్ఎస్ తో... ఇలా మీరు పొత్తు పెట్టుకోని పార్టీ ఏదైనా ఉందా? అని ప్రశ్నించారు. కాలానుగుణంగా మాట్లాడే వ్యక్తులతో చర్చ అవసరం లేదని అన్నారు. మీ పార్టీకి ఎన్నికల కమిషన్ గుర్తింపును రద్దు చేసిందని... ప్రస్తుతం మీరు ఒక రాజకీయ పార్టీగా లేరని... కొందరికి ఏజెంట్లుగా మాత్రమే ఉన్నారని ఎద్దేవా చేశారు.