Sunil Deodhar: తిరుపతి బరిలో వైసీపీ, టీడీపీ కేవలం బీజేపీనే లక్ష్యంగా చేసుకున్నాయి: సునీల్ దేవధర్
- ఏప్రిల్ 17న తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక
- పార్టీల మధ్య మాటల యుద్ధం
- వైసీపీ, టీడీపీ కుటుంబ పార్టీలన్న దేవధర్
- తమను చూసి భయపడుతున్నాయని వ్యాఖ్యలు
- తిరుపతిలో తమదే గెలుపు అని ధీమా
ఏపీ బీజేపీ వ్యవహారాల సహ ఇన్చార్జి సునీల్ దేవధర్ తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీలపై ధ్వజమెత్తారు. వైసీపీ, టీడీపీ కుటుంబ పార్టీలని విమర్శించారు. ఆ రెండు పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకోకుండా, కేవలం బీజేపీని లక్ష్యంగా చేసుకున్నాయని ఆరోపించారు.
ఏపీలో బీజేపీ-జనసేన కూటమికి ప్రజల్లో ఆదరణ పెరుగుతుండడంతో వైసీపీ, టీడీపీ నేతలు భయపడుతున్నారనడానికి ఇదే నిదర్శనం అన్నారు. తిరుపతిలో తాము విజయం కోసం పోరాడుతుంటే, టీడీపీ తన రెండోస్థానాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోందని సునీల్ దేవధర్ ఎద్దేవా చేశారు.
తిరుపతి పార్లమెంటు స్థానానికి ఏప్రిల్ 17న ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. బీజేపీ తరఫున మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ పోటీ చేస్తుండగా, వైసీపీ తరఫున డాక్టర్ గురుమూర్తి, టీడీపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ చింతా మోహన్ బరిలో ఉన్నారు. కాగా, తిరుపతి బరిలో ఇప్పటివరకు 34 మంది నామినేషన్లు దాఖలు చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.