Corona Virus: పిల్లల్లోనూ సమర్థంగా పనిచేస్తున్న ఫైజర్ టీకా
- 12-15 ఏళ్ల మధ్య వయస్సు గల వారిలో బలమైన రోగనిరోధకత
- దుష్ప్రభావాలూ ఉంటాయని స్పష్టం
- పాఠశాలల పునఃప్రారంభం దిశగా కీలక అడుగు
- రెండేళ్ల పాటు పరిశీలనలో వాలంటీర్లు
కరోనా వ్యాక్సిన్ విషయంలో మరో కీలక ముందడుగు పడింది. ఇప్పటి వరకు పెద్దలకు మాత్రమే టీకా ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాము అభివృద్ధి చేసిన టీకా పిల్లల్లోనూ సమర్థంగా పనిచేస్తోందని ఫైజర్ ప్రకటించింది.
12-15 ఏళ్ల వయసు గల పిల్లల్లో తమ టీకా వల్ల బలమైన రోగనిరోధక వ్యవస్థ ఏర్పడినట్లు ఫైజర్ ప్రకటించింది. పిల్లల చదువులకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న వేళ ఈ అప్డేట్ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. పాఠశాలలను తెరిచే విషయంలో ఇది ఓ ముందడుగు కానుందని ఫైజర్ అభిప్రాయపడింది. 12-15 ఏళ్ల వయసు గల 2,260 మంది పిల్లలకు టీకా అందించగా.. ఒక్కరిలోనూ కొవిడ్ కేసులు నమోదు కాలేదని తెలిపింది.
ఈ టీకా వల్ల కరోనాను సమర్థంగా ఎదుర్కొనే బలమైన రోగనిరోధక వ్యవస్థ ఏర్పడ్డట్లు ఫైజర్ పేర్కొంది. పెద్దల కంటే కూడా ఎక్కువ మోతాదులోనే యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు తెలిపింది. అయితే, పెద్దల్లో ఉన్నట్లుగానే పిల్లల్లోనూ దుష్ప్రభావాలు ఉంటాయని స్పష్టం చేసింది. క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న వాలంటీర్ల ఆరోగ్యాన్ని రెండేళ్ల పాటు పరిశీలిస్తామని పేర్కొంది.