AIIMS: అచ్చం బ్రిటన్ లో జరిగినట్టే ఇక్కడా జరుగుతోంది: ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా
- అక్కడ క్రిస్మస్ టైంలోనే వైరస్ లో జన్యుపరివర్తనలు
- భారత్ లో హోలీ పండుగ సమయంలో కేసుల పెరుగుదల
- వైరస్ లో జన్యుపరమైన మార్పులు జరిగి ఉండొచ్చు
- పిల్లల వ్యాక్సిన్ పై భారత్ బయోటెక్, ఆస్ట్రాజెనికా ప్రయత్నాలు
కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. రోజును మించి రోజు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే, అచ్చం బ్రిటన్ లో నమోదైనట్టే ఇక్కడా కేసులు నమోదవుతున్నాయని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా అన్నారు. బ్రిటన్ లో క్రిస్మస్ పండుగ సందర్భంగానే వైరస్ జన్యుమార్పులకు గురై కొత్త రకం కరోనా పుట్టిందని, మనదేశంలోనూ అదే జరుగుతోందని అన్నారు. హోలీ పండుగప్పుడే కేసులు పెరగడం మరీ ఎక్కువైందన్నారు.
బ్రిటన్ లో అప్పుడు ఏదైతే జరిగిందో ఇప్పుడు భారత్ లోనూ అదే జరుగుతోందని చెప్పుకొచ్చారు. కేసులు వేగంగా పెరిగిపోవడం వెనుక కొత్త రకం కరోనా ఉండి ఉంటుందన్నారు. ఉన్నట్టుండి కేసులు ఇంత వేగంగా పెరిగిపోతున్నాయంటే దానికి కారణం వైరస్ లో జన్యు పరివర్తనలు జరుగుతూ ఉండి ఉండొచ్చన్నారు. కాబట్టి వీలైనంత వేగంగా ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ను అందించాల్సిన అవసరం ఉందన్నారు.
పిల్లలకూ ఇచ్చేలా కరోనా వ్యాక్సిన్ పై ఆస్ట్రాజెనికా–సీరమ్ ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్ లు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన చెప్పారు. మహమ్మారికి చరమగీతం పాడాలన్నా, పిల్లలు బడికి పోవాలన్నా.. పిల్లలకు ఇచ్చే కరోనా వ్యాక్సిన్లపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు.