Vakkantham Vamsi: నితిన్ హీరోగా వక్కంతం వంశీ మూవీ!
- 'నా పేరు సూర్య'తో దర్శకుడిగా వంశీ
- నితిన్ తాజా చిత్రంగా 'మాస్ట్రో'
- వక్కంతం వంశీకి గ్రీన్ సిగ్నల్
వక్కంతం వంశీ మంచి రైటర్ అనే విషయం తెలిసిందే. 'కిక్' .. 'ఎవడు' .. 'రేసుగుర్రం' .. 'టెంపర్' వంటి హిట్ చిత్రాలకు కథలను అందించినది ఆయనే. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ కలగలిసిన కథలను ఆసక్తికరంగా అల్లడంలో వక్కంతం వంశీ సిద్ధహస్తుడు. యూత్ తో పాటు మాస్ .. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలను మేళవిస్తూ కథలను సిద్ధం చేయడం ఆయన ప్రత్యేకత.
అలా కొంతకాలం పాటు రచయితగా మంచి పేరు తెచ్చుకున్న ఆయన, ఆ తరువాత మెగా ఫోన్ పట్టేశాడు. అల్లు అర్జున్ హీరోగా 'నా పేరు సూర్య .. నా ఇల్లు ఇండియా' సినిమాను తెరకెక్కించాడు. రచయితగా అల్లు అర్జున్ కి 'రేసుగుర్రం'తో హిట్ ఇచ్చిన వక్కంతం వంశీ, దర్శకుడిగా మాత్రం సక్సెస్ ను అందించలేకపోయాడు. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో అప్పటి నుంచి వక్కంతం వంశీ సరైన అవకాశం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు.
లాక్ డౌన్ సమయంలో ఓ కథపై కసరత్తు చేస్తూ వచ్చిన ఆయన, ఇటీవల నితిన్ ను కలిసి ఆ కథను చెప్పాడట. ఆ కథ కొత్తగా ఉండటంతో .. ఇంతవరకూ తాను చేయని పాత్ర కావడంతో వెంటనే నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ 'అంధాదున్' రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాకి 'మాస్ట్రో' అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. ఈ సినిమా తరువాత వక్కంతం వంశీ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉందని అంటున్నారు.