Jagan: అర్ధాంగి భారతితో కలిసి వెళ్లి గుంటూరులో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న జగన్
- వార్డు, గ్రామ సచివాలయాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభం
- కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే వ్యాక్సినేషన్
- రాష్ట్రంలో 3 నెలల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం
- వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళతారు: జగన్
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ఈ రోజు గుంటూరులోని భారత్‌పేటలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. తన భార్య వైఎస్ భారతితో కలిసి ఆయన ఇక్కడకు వచ్చారు. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత వార్డు, గ్రామ సచివాలయాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే వ్యాక్సిన్ వేసే కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు.
రాష్ట్రంలో కేవలం మూడు నెలల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. గ్రామాల్లో ప్రజలకు వ్యాక్సిన్ వేసే విషయంపై వాలంటీర్లకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. వాలంటీర్లు గ్రామాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి 45 ఏళ్లు దాటినవారి వివరాలను తీసుకుంటారని చెప్పారు. ప్రజలకు ఏయే రోజు వ్యాక్సిన్ వేస్తారు? ఎప్పుడు వెళ్లాలనే అంశాలను వివరించి చెబుతారని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి మండలంలోని పీహెచ్‌సీల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన వివరించారు.